27, నవంబర్ 2020, శుక్రవారం

23 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై మూడవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

23 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై మూడవ రోజు పారాయణము


పదిహేనవ అధ్యాయము 


వీరభద్రుడి మూర్ఛతో  వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరున్ని శరణు వేడింది. అభవుడయిన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది వాహనాన్ని అధిష్టించి రణభూమికి బయలుదేరాడు. 

అంతవరకూ భయకంపితులైన సమస్త గణాలవాళ్ళూ కూడా శివసందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధప్రవేశం చేశారు. 

నంది వాహనారూఢుడై వస్తూన్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాలవలె రాక్షసులంతా పారిపోసాగారు. 

జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు. శుంభనిశుంభ కాలనేమ్యాశ్వముఖ, బలాహక, ఖడ్గరోమ, ప్రచండ, ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక్కుమ్మడిగా ఈశ్వరుడితో తలపడ్డారు. సర్వేశ్వరుడైన శివుడికి వీళ్ళేపాటి? ఆయనొక గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు. 

బలాహకుడి తలను రెండు చెక్కలుగా చేసేశాడు. పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు. ఈ లోపల శివ వాహనమైన వృషభం యొక్క శృంగ (కొమ్ముల) ఘాతాలకి అనేకమంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు. 

శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనాఛత్రాన్ని చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడినే తనతో యుద్ధానికి పిలిచాడు. 

ఆహ్వాన సూచకంగా పదిబలమైన బాణాలతో పశుపతిని గాయపర్చాడు. అయినా శివుడి మోహంలో చిరునవ్వు మాయలేదు. 

ఆ మందహాసంతోనే జలంధరుడినీ, గుర్రాలనీ, రథాన్నీ, జెండానీ, ధనుస్సునీ నరికేశాడు. రథహీనుడైన రాక్షసుడు - ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు. 

శివుడా గదని తన బాణాలతో విరగగొట్టేశాడు. నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు. 

ఒకే ఒక్క బాణంతో వాడిని రెండుమైళ్ళ వెనుకపడేలా కొట్టాడు విరాట్ శిఖామణి అయిన శివుడు. 

అంతటితో జలంధరుడు, ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వ సమ్మోహనకరమయిన గాంధర్వ మాయను ప్రయోగించాడు. 

నాదమూర్తియైన నటరాజు మొహితుడు అయ్యాడు. గాంధర్వ గానాలు, అప్సరా నాట్యాలు, దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడయి పోయాడు. 

ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలూ చేజారిపోయాయి. ఎప్పుడైతే మృడుడు అలా మోహితుడై పోయాడో తక్షణమే జలంధరుడు శుంభ-నిశుంభలిద్దరినీ యుద్ధంలో నిలబెట్టి, తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు.

వెళ్ళేముందు శివస్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు. 'మాయ'తప్ప, బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ, పదిచేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుదాలతోనూ ఒకానొక మాయావృషభం మీద శివ మందిరమైన పార్వతీ అంతఃపురానికి బయలుదేరాడు. 

అలా వస్తూవున్న మాయా జలంధరుడిని చూసి, అంతవరకూ పరదృష్టి గోచరంగాని పార్వతి, వాడి దృష్టిపథంలో పడింది. 

అందానికి మారుపేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు. ఎప్పుడయితే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో, వాడి మాయా విద్య నశించిపోయింది. వాడు రాక్షసుడు అనే విషయం పార్వతికి అర్థమైపోయింది. 

అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది. తక్షణమే ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ప్రత్యక్షమయిన విష్ణువు ఇలా చెప్పాడు 'తల్లీ! పార్వతీ! వాడు చూపించిన దారిలోనే నేనుకూడా ప్రయాణించాల్సి వుంది. 

దిగులుపడకు' అని ఆమెను ఓదార్చాడు. 'నీ ప్రాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడు అయ్యాడో అలాగే ఆ జలంధరుని భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరానివాడుగా తయారయ్యాడు. 

వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే, నేను వాడి ఇల్లాలి యందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను.' అని ధైర్యం చెప్పి, రాక్షసలోకానికి బయల్దేరాడు విష్ణువు. 


పదిహేనవ అధ్యాయం సమాప్తం


పదహారవ అధ్యాయం


ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు, అక్కడ ఆ రాక్షస రాజ్యంలో, జలంధరుడి భార్య అయిన బృందకు దుస్స్వప్నాలు కలుగసాగాయి

ఆమె కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లూ, దిగంబరుడు అయినట్లూ, ఒళ్ళంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లూ, నల్లటి రంగు పువ్వులతో అలంకరించబడినట్లూ, పూర్తిగా ముండనం (గుండు) చేయించుకున్నట్లూ, దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లూ, తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లూ కలలు వచ్చాయి. 

అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి, తను చూసినది కలే అని తెలుసుకుని, అది ఆశుభమని తలపోసి చింతించసాగింది. 

ఐనా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిక్కులా మసలసాగింది. 

ఆ విధంగా ఒకానొక వేళ వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనుపించారు. 

వారిని చూసి భీతావహయైన బృంద, వెనుదిరిగి పారిపోతూ ఆ వనంలోనే శిష్య సమేతుడై ఉన్న ఒకానొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని 'ఓ మునివర్యా! నన్ను రక్షించు. నాకు నీవే శరణు' అని కేకలు వేయసాగింది. 

అప్పుడా ముని భయగ్రస్తురాలైన ఆమెనూ, ఆమెని వెన్నంటి వస్తున్న రాక్షసులని చూసి ఒక్క హుంకార మాత్రం చేత, ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు. 

అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్ గా ప్రణమిల్లి 'ఓ ఋషీంద్రా! ఈ గండం నుంచి నన్ను కాపాడిన దయాళుడవు గనుక, నేను నా సంశయాలను కొన్నిటిని నీ ముందుంచుతున్నాను. 

నా భర్తయైన జలధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా వుందో దయచేసి నాకు తెలియజేయి' అని ప్రార్థించింది. 

కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశంవంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. 

మునివారికి కనుబొమ్మలతోనే కర్యవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్ళా ఆకాశానికి ఎగిరి, అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలను తెచ్చి వారి ముందుంచాయి. 

తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద ఘోల్లుమని ఏడ్చింది. అక్కడే వున్న ఋషి పాదాలపై బడి తన భర్తను బ్రతికించవలసినదిగా ప్రార్థించింది. 

అందుకా ముని నవ్వుతూ 'శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవలన తప్పక బ్రతికిస్తాను' అంటూనే అంతర్హితుడయ్యాడు. 

అతనలా మాయమైనదే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతక్కుని, అతడు సజీవుడు అయ్యాడు. 

ఖిన్నురాలై వున్న బృందను కౌగలించుకుని, ఆమె ముఖాన్ని పదేపదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. 

మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా, ఒకానొక ఉరట సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించివేసింది. 

మగడి వేషంలో వచ్చి తన ప్రతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుడిపై విపరీతంగా ఆగ్రహించింది. 

'ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీ గామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక! నీ మాయతో ఇతఃపూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేష సహితుడవై అడవుల బడి తిరుగుతూ, వానర సహాయమే గతియైనవాడవవు గాక!' అని శపించి అని అభిలషిస్తూ చేరువ అవుతున్న శ్రీహరి నుంచి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని అందులోపడి బూడిదైపోయింది. 

అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు, ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతి పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 

పదిహేనవ పదహారవ అధ్యాయాలు సమాప్తం


ఇరవైమూడవ (బహుళ అష్టమి)రోజు పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో 23 వ రోజు పారాయణం చూడండి.


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,   కామెంట్   చేయడం మర్చిపోకండి   




22 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై రెండవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

22 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై రెండవ రోజు పారాయణము

కార్తీక పురాణము - ఇరువైరెండవ రోజు పారాయణ 

పదమూడవ అధ్యాయం 


నారద ఉవాచ: 

ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడిమీద రణభేరీ వేయించాడు.

కోట్లాది సేనలతో - కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన వున్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు. 

తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది. 

రాక్షససేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం, వర్షకాలపు మేఘావృత్తమైన ఆకాశంవలే కనిపించసాగింది. 

ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకుని రహస్యమార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు. 

'ఓ దేవాధిదేవా! ఇన్నినాళ్ళుగా వాడివల్ల మేము పడుతున్న ఇక్కట్లు అన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. 

సర్వలోక కళ్యాణార్థం, మా రక్షణార్థం వాడిని జయించు తండ్రీ!' అని ప్రార్థించారు.

వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు, విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనని 'కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుడిని యమునిపాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదలి వాడి ఇంట్లో కాపురం ఉండడం ఏమిటి?' అని ప్రశ్నించాడు. 

అందుకు జవాబుగా విష్ణువు 'పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడంచేతా, లక్ష్మికి సోదరుడు కావడంచేతా, యుద్ధంలో నాచేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వాడిని జయించు' అని చెప్పాడు. 

అందుమీదట శివుడు 'ఓ దేవతలారా! వాడు మహా పరాక్రమవంతుడు. ఈ శాస్త్రాలవల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాడు. కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశాస్త్రాలలో మీమీ తేజస్సులను సయితం ప్రకాశింపచేయాలి' అని ఆజ్ఞాపించడంతో, విష్ణ్వాది దేవతలందరూ తమతమ తేజస్సులను బయల్పరిచారు. 

గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి, మహోత్తమమూ, భీషణ జ్వాలాసముదాయసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన 'సుదర్శన'మనే చక్రాన్ని వినిర్మించాడు.

అప్పటికే ఒకకోటి ఏనుగులు, ఒకకోటి గుర్రాలు, ఒకకోటి కాల్బలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి, దేవతలూ, ప్రమథగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి.

నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమతమ గణాలతో జలంధరుడిని ఎదుర్కొన్నారు. 

రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచీ వచ్చే వీరరస ప్రేరకాలయన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమీ ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది.

పరస్పర ప్రయోగితాలైన - శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాద్యాయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగావుంది. 

యుద్ధభూమిలో నేలకూలిన రధగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి. 

ఆ మహాహవంలో ప్రమథగణోపహతులైన దైత్యులని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుడి చెవినబడింది. 

తక్షణమే ఆయన ముఖంనుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది, అత్యంత భయంకరమైన తాలుజంఘోదర వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ రణస్థలి చేరింది.


శ్లో  || సా యుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్ 
         భార్గవం స్వభగేధృత్వా జాగా మాంతర్హితా సభః !!


రావడం రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపుఊపు శుక్రుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్థానమైపోయింది.

మరణించినవాళ్ళను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమాదగణాల విజృంభనకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలె చెల్లాచెదరయిపోసాగింది. 

అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధించసాగారు. 

ఎంచక్కటి పంటమీద మిడతల దండులాగా తమమీదపడే రాక్షసబాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్లవలె తయారయిన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగారు. 

అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. 


పదమూడవ అధ్యాయం సమాప్తం

పదనాల్గవ అధ్యాయం 

నందేశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. 

నిశుంభుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలనూ, జెండానూ, ధనుస్సునూ, సారథినీ నాశనం చేసేశాడు. 

అందుకు కోపంతో కాలనేమి నందీశ్వరుడి ధనుస్సును ఖండించాడు. 

క్రుద్దుడయిన నంది శూలాయుధంతో కాలనేమిని ఎదుర్కొన్నాడు. 

కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని పెకలించి నందిని మోదాడు. 

నంది మూర్ఛపోయాడు. వినాయకుడు తన బాణాలతో శుంభుడి సారధిని చంపేశాడు.

అందుకు కోపంతో శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణాలతో బాధించాడు.

అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో, వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి - కాలినడకన శుంభుడిని చేరి వాడి వక్షస్థలాన్ని గాయపరిచాడు. 

వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. 

ఇది గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకుడికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూశ్మాండ-భైరవ-భేతాళ-పిశాచ-యోగినీగణాలన్నీ ఆయనను అనుసరించాయి. 

గణసహితుడైన వీరభద్రుడి విజృంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు.

వాళ్ళందరి విజృంభనతో వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు 'అతి' అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. 

జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాలమధ్య ప్రాంతమంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడినీ తొమ్మిది బాణాలతో నందీశ్వరుడినీ, ఇరవై బాణాలతో వీరభద్రుడినీ కొట్టి మూర్ఛపోగొట్టి, భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు - ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ, పతాకన్నీ, గొడుగునూ నరికేశాడు. 

మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు 'పరిఘ' అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు. 

అద్బుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు విగత స్పృహుడయ్యాడు.


పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం

ఇరువైరెండవ (బహుళ సప్తమి)రోజు పారాయణ సమాప్తం. 
 
ఈ క్రింది 22 వ రోజు వీడియో యు .ఆర్.యల్ లు చూడండి 


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందిథాంక్యూ.


26, నవంబర్ 2020, గురువారం

21 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఒకటవ రోజు పారాయణము

wowitstelugu.blogspot.com

21 కార్తీక పురాణము విశిష్టత - ఇరవై ఒకటవ రోజు పారాయణము


పదకొండవ అధ్యాయము

మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించవస్తున్న జలంధరుడికి భయపడినవారై దేవతలు అంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.

సర్వదేవతా కృత విష్ణు స్తోత్రం

శ్లో||      నమో మత్స్య కుర్మాది నానా స్వరూపై 

    సదాభక్త కార్యోద్యతా యార్తి హంత్రే 

    విధాత్రాధి  పరగస్థితి ధ్వంసకర్త్రే 

    గదాశంఖ సద్మాసి హస్తయతే స్తు || 1 ||


            రమావల్లభో యసురాణాం నిహంత్రే 

            భుజంగారి యానాయ పీతాంబరాయ 

            మఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే 

            శరణ్యాయ తస్మై వతాస్మొనతాస్మః || 2 || 

 

   నమో దైత్య సంతాపి తామర్త్యదుఃఖా  

   చల ధ్వంసదంభోళయే విష్ణవేతే 

   భుజంగేళ టేల్ శయా నార్కచంద్ర 

             ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః || 3 ||


నారద ఉవాచ:

 సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః 

 స కదాచిన్న సంకష్టైః పీడ్యతే కృపయాహరేః


మత్స్యకూర్మాది అవతారములు ధరించినవాడునూ - సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడును, దుఃఖములను నశింపచేయువాడును, బ్రహ్మాదులను సృష్టించి, పెంచి, లయింపచేయువాడును, గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించినవాడును యగు నీకు నమస్కారము.

(1)  

లక్ష్మీపతి, రాక్షసారతి గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించినవాడును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వ రక్షకుడవూనగు నీకు నమస్కార మగునుగాక.

(2)

రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధమువంటి వదవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును యగు ఓ విష్ణూ! నీకు నమస్కారము. పునః పునః నమస్కారము.

(3)

ఇలా దేవతలచేత రచించబడినదీ, సమస్త కష్టాలను సమయింప చేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడు అయితే పఠిస్తూ ఉంటాడో వాడి యొక్క ఆపదలన్నీ ఆ శ్రీహరి దయవలన తొలగిపోతాయి' అని పృథువుకు చెప్పి, నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. 

  • ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినపడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడవాహనంవైపు కదులుతూ 'లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరుడికీ-దేవగణాలకి యుద్ధం జరుగుతుంది. దేవరలు నన్ను ఆశ్రయించారు. నేను వెడుతున్నాను' అని చెప్పాడు. 

  • ఇందిరాదేవి రవంత చలించినదై 'నాథా! నేను నీకు ప్రియురాలనై ఉండగా నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది?' అని ప్రశ్నించింది. ఆ మాటకి ఆ మాధవుడు నవ్వి 'నిజమే దేవీ! నాకు నీ మీదనున్న ప్రేమచేతా, బ్రహ్మనుండి అతను పొందిన వరముల చేతా, శివాంశసంజాతుడు కావడం చేతా జలంధరుడు నాచేత చంపదగినవాడు కాదు' అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీకృతుడై, గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు.

  • మహాబలియైన గరుడుడి రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘశకలాలవలె చెల్లాచెదురై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విషువును ఎదిరించాడు. వారిమధ్యన జరిగిన ఘోరయుద్ధం వలన, ఆకాశమంతా బాణాలతో కప్పబడిపోయింది. 

  • అద్భుతకర్ముడైన శ్రీహరి అనేక బాణాలతో జలంధరుడియొక్క జెండానీ, రథచక్రాలనీ ధనుస్సునీ చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో, గరుత్మంతుడు భూమికి వాలాడు. 

  • తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన యసురేంద్రుడు - ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలశాయికీ, జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమయింది. 

  • ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్ళకీ భూమిమొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుడి జలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు 'నీ పరాక్రమం నన్ను ముగ్దుడిని చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. 

  • విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి 'బావా! రమారమణా! నీవు నాయందు నిజంగా ప్రసన్నుడవు అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతోనూ సహా తక్షణమే వచ్చి నాయింట కొలువుండిపో''మ్మని కోరాడు.

  • తాను ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలివెళ్ళాడు. 

  • సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్టించాడు జలంధరుడు. దేవ, స్థిత, గంధర్వాదులు అందరివద్ద ఉన్న రత్నసముదాయాన్ని అంతటినీ స్వాధీనపరచుకున్నాడు. 

  • వాళ్ళనందరినీ తన పట్టణంలో పడివుండేటట్లుగా చేసుకుని, తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథుచక్రవర్తీ! ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన యింట కొలువు ఉంచుకుని, భూలోకమంతటినీ ఏకాచ్చద్రాదిపత్యంగా ఏలుతుండగా, విష్ణుసేవా నిమిత్తంగా నే (నారదుడు) ఒకసారి ఆ జలంధరుడి ఇంటికి వెళ్ళాను.

పదకొండవ అధ్యాయం సమాప్తం

పన్నెండవ అధ్యాయం

నారదుడు చెబుతున్నాడు

పృథురాజా! అలా తన గృహానికి వెళ్ళిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తిప్రపత్తులతో శాస్త్రవిధిగా సత్కరించి, తరువాత 'మునిరాజా! ఎక్కడ నుంచి ఇలా విచ్చేశావు? ఏయే లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే, దానిని తప్పక నెరవేర్చుతాను' అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను.

'జలంధరా! యోజన పరిమాణమూ, పొడవూ గలదీ అనేకానేక కల్పవృక్షాలను, కామధేనువులనూ గలదీ - చింతామణులచే ప్రకాశవంతమైనదీ అయిన కైలాసశిఖరంపై - పార్వతీ సమేతుడు అయిన పశుపతిని సందర్శించాను. 

ఆ విభవాలకు దిగ్భ్రాంతుడినయిన నేను అంతటి సంపదకలవారు మరెవరయినా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను కూడా చూసి - నువ్వు గొప్పవాడివో, ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని యిలా వచ్చాను. 

అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ దీటుగానే వున్నారుగాని ఒక్క స్త్రీ రత్నపు ఆధిక్యతవల్ల, నీకన్నా ఆ శివుడే ఉత్కృష్టవైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ యింట్లో అచ్చరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరయినా ఉందురుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు.

కళ్యాణాత్పూర్వం వీతరాగుడయిన విషమాంబకుడు సైతం యే విదుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకేనా ఈడుకాలేదు. 

నిత్యమూ ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. 

నీకెన్ని సంపదలున్నప్పటికీకూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడంవలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుడికి తర్వాత వాడివేగాని, ప్రథముడివి మాత్రం కావు.

ఉపర్యుక్తవిధంగా, జలంధరుడితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను. అనంతరం, పార్వతీ సౌందర్య ప్రలోభుడై, జలంధతీరుడు మన్మధబగ్వగ్రస్తుడు అయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవుగదా! అందువల్ల విష్ణుమాయా మొహితుడు అయిన ఆ జలంధరుడు సింహికానందనుడయిన 'రాహు' అనే వాణ్ణి చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాడు. 

శుక్లపక్షపు చంద్రుడిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాసపర్వతాలు అన్నీ, తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి, తన రాకను నందీశ్వరుడిద్వారా నటరాజుకు కబురుపెట్టాడు. 

'ఏం పనిమీద వచ్చావు?' అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు ...

ఓ కైలాసవాసా! ఆకాశంలోని దేవతలచేతా, పాతాళంలోని ఫణులచేతా కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకూ ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. 

హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడివీ, ఎముకల పోగులను ధరించేవాడివీ, దిగంబరుడివీ అయిన నీకు హిమవంతుడి కూతురూ, అతిలోక సౌందర్యవతీ అయిన పార్వతి భార్యగా పనికిరాదు. 

ప్రపంచంలోని అన్నిరకాల రత్నాలకూ నేను రాజునివున్నాను. కాబట్టి, స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తని అవడానికి నేనే అర్హుడినిగాని, నువ్వేమాత్రమూ తగవు.


కీర్తిముఖ ఉపాఖ్యానము

  • రాహువు ఇలా చెబుతుండగానే ఈశ్వరుడియొక్క కనుబొమ్మలవలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వనికలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఖించబోగా - రాహువు భయపడి పారిపోబోయాడు. 

  • కాని, అ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మ్రింగివేయబోయాడు. అయినప్పటికినీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో, ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై, శివాభిముఖుడై 'హే జగన్నాథా! నాకు అసలే ఆకలి, దప్పికలు ఎక్కువ. వేటిని తినవద్దు అంటున్నావు గనుక, నాకు తగిన ఆహారపానీయాలు ఏమిటో ఆనతి ఇవ్వు' అని అన్నాడు. 

  • హరుడు అతనిని చూసి 'నీ మాంసాన్నే నీవు ఆరగించు' అన్నాడు. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప మిగిలిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు. 

  • శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుడిపట్ల కృపాళుడయిన మహాశివుడు - నీ యీ భయంకర కృత్యానికి సంతుష్టుడిని అయినాను. ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు'మని ఆశీర్వదించాడు. 

  • ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవషేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు 'ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించినవారి పూజలన్నీ వృథా అవుతాయి గనుక నన్ను అర్చించదలచినవారు ముందుగా కీర్తిముఖుడిని పూజించితీరాలి' అని ఈశ్వరుడు శాసించాడు కూడా. 

  • అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బార్బరస్థలంలో విముక్తుడిని చేయడంవలన తదాదిగా రాహువు బర్బరనామధేయంతో ప్రసిద్ధిచెందాడు. 

  • ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి, భయవిముక్తుడై జలంధరుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు.

పదకొండు, పన్నెండు అధ్యాయములు సమాప్తం

ఇరవైఒకటవ (బహుళ షష్ఠి)రోజు పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్,లు . చూడండి... 

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.