24, ఏప్రిల్ 2021, శనివారం

శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు వాటి అర్ధం వివరణ తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు వాటి అర్ధం వివరణ  తెలుసుకోండి


విష్ణు భగవానుడు  భక్తులను ఆదుకోవడానికి దుస్టులను శిక్షించడానికి  అనేక అవతారాలు ఎత్తాడు కృష్ణావతారం లో గోవిందుడంటే కృష్ణుడనే అర్థం చాలామందికి తెలిసినదే. కాని, ఆ పేరు రావడానికి కారణం ఆసక్తికరం. ఉత్తర దేశంలో మధురానగరానికి సవిూపంలో గోవర్ధనగిరి ఇప్పటికీ ఉంది. ఇంద్రుడు కోపం వచ్చి గోగణాల విూద శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద గోగణాలకు ఆశ్రయం కల్పించాడనీ, ఇంద్రుడు కృష్ణుడి శక్తిని తెలుసుకొని, అతడితో స్నేహాన్ని కోరి, గోగణాలకు కృష్ణుడిని అధిపతి కావించాడనీ అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడైనాడనీ ఐతిహస్యం వెంకటేశ్వర స్వామిని కూడా గోవిందుడనే అంటారు .


శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణ పురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

నందనందన గోవిందా
నవనీతచోరా గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్ట నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్లనోద్ధార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవ ప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

మత్స్యకూర్మ గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామనభృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజన పోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మత్స్యావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా
విరజాతీరస్థ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరీతిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
వానరసేవిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హథీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఆపన్నివారణ గోవిందా
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆసందరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళు గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

శేషశాయి గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

గోవింద నామాలు వాటి అర్ధం వివరణ 

1. గోవింద : 

1. ఇంద్రియాలకు ఆనందం కలిగించేవాడు.  పంచేంద్రియాలు అనగా (1) కన్ను (2) ముక్కు (3) చెవి,  (4) నోరు (నాలుక) (5) చర్మము.

2. ప్రాణులను రక్షించేవాడు.

హరి : అనగా విష్ణుమూర్తి, పాపాలను హరించువాడు. గోకుల నందన అనగా 'గో' అనగా ప్రాణులు, 'కుల' అనగా సముహం. నందన అనగా ఆనందం కలుగజేయువాడు, నంద నందన అనగా నందుని కుమారుడు. వారి వృత్తి గోవులను కాయటం. శ్రీకృష్ణుడు కూడ ఆవులను కాశాడు.

2. శ్రీ శ్రీనివాస గోవిందా : 

శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని వక్షస్థలంనందు ధరించిన వాడు. లక్ష్మి ఎక్కడ ఉంటే హరి అక్కడేఉంటాడు

3. శ్రీ వేంకటేశా గోవిందా :

వేం అంటే పాపాలు, కటా అంటే నశింపజేయువాడు. పాపాలను నశింపజేయువాడని అర్థం.

4. భక్తవత్సల గోవిందా : 

భక్తులయందు ప్రేమకల్గినవాడు.

5. భాగవత ప్రియా గోవిందా : 

భగవంతుని నమ్మినవాడు, అంటే ఇష్టపడేవారు. అంటే తనను నమ్మిన వారిని ప్రేమించేవాడని అర్థం.


6. నిత్యనిర్మలా గోవిందా : 

ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు.  స్పటికంవలె స్వచ్ఛంగా ఉండి ఎటువంటి కల్మషాలు అంటకుండా ఉండేవాడు (పవిత్రత కల్గినవాడు)


7. నీలమేఘశ్యామా గోవిందా : 

నీల వర్ణపు శరీరచ్ఛాయ కల్గినవాడు.  భక్తులకు ఆనందం కలిగించేవాడు. దుష్టులకు కఠినమైన వాడు.


8. పురాణపురుషా గోవిందా : 

పురాణాలలో కీర్తించబడినవాడు. అందువల్ల పురాణపురుషా గోవిందా అంటారు. పుర అనగా శరీరం. ప్రతి ప్రాణి శరీరంలోనూ నివసించేవాడు.


9. పుండరీకాక్ష గోవిందా : 

తామరపూవు వంటి కన్నులు గలవాడగుటచే పుండరీకాక్ష అని పిలుస్తారు. హృదయ పద్మంలో ధ్యానింపబడేవాడు కావడంచేతను పుండరీకాక్ష అని కూడ పిలవబడుతున్నాడు. క్రీగంటి చూపు, విప్పారిన నయనాలతో భక్తులను దయార్ద్ర దృష్టితో  వీక్షించువాడు.


10. గోవిందా.. హరి గోవిందా గోకుల నందన గోవిందా : 

గోకులం పుట్టినవాడు నందరాజు కుమారుడు గోవిందుడు. 


11. నంద నందనా గోవిందా : 

నంద రాజు కుమారుడు శ్రీకృష్ణుడు.తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు. దేవకి కంసుని చెల్లెలు. దేవకీదేవి గర్భంలో జన్మించిన 8వ శిశువు కంసుని చంపుతుందని, ఆకాశవాణి చెప్పడంవల్ల, కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. 8వ శిశువుగా పుట్టిన కృష్ణుని వసుదేవుడు యమునా నదిని దాటించి నందుని భార్య అయిన యశోద ప్రక్కలో పడుకోబెట్టాడు. అందువల్ల యశోద నందులు శ్రీకృష్ణునికి తల్లిదండ్రులు అయ్యారు.


12. నవనీతచోర గోవిందా : 

నవనీతం అంటే వెన్న, చోర అంటే దొంగ. భక్తుల యొక్క హృదయాలు వెన్నవలె అమృతప్రాయంగా ఉంటాయి. అటువంటి భక్తుల మనస్సులలో కొలువై ఉండి వారి హృదయాలను చూరగొనడంవల్ల నవనీతచోరుడు అయ్యాడు.



13. పశుపాలకశ్రీ గోవిందా : 

గోకులంలో ఉన్నపుడు గోవులను కాచే వాడు గనుక పశుపాలకశ్రీ అంటారు. పశువులు అనగా సమస్త జీవులు. పశుపాలకుడు అనగా సమస్త జీవరాశులను రక్షించువాడు.

14. పాపవిమోచన గోవిందా : 

గోవింద నామం పలుకగానే చేసిన పాపాలను పోగొట్టి విముక్తి కలుగజేసేవాడు కనుక పాప విమోచన అంటారు.

15. దుష్టసంహార గోవిందా : 

దుష్టులు అనగా చెడ్డవారు, సంహార అంటే చంపువాడు. చెడ్డవారైనటువంటి రాక్షసులను కంసుడు, నరకుడు, మొదలైనవారిని సంహరించినవాడు.

16. దురితనివారణ గోవిందా : 

దురితములు అంటే పాపాలు, మనుష్యులు తెలిసి, తెలియక చేసిన పాపాలన్ని, దైవ చింతనతో తొలగిపోతాయి. వాల్మీకి మొదట ఒక బోయవాడు. దారిదోపిడీ చేసి జీవించేవాడు. రామనామాన్ని అత్యంత నిష్ఠతో ధ్యానించడం వల్ల ఆ దేవదేవుడు పాపాలను పోగొట్టి రామాయణ రచన చేయించాడు.


17. శిష్టపరిపాలక గోవిందా : 

శిష్టులు అంటే మంచివారు. మంచి వారికి కష్టాలు వచ్చినపుడు గోవిందనామ స్మరణ చేస్తే వారి కష్టాలు తొలగిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం! ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.

ఉ|| ప్రహ్లాదుడు, సతీ సక్కుబాయి.

18. కష్టనివారణ గోవిందా : 

గోవిందనామ స్మరణ చేసే భక్తులకు రాబోపు కష్టాలను భగవంతుడు వెంటఉండి పోగొడతాడు. అక్షయ పాత్ర శుద్ధి చేసి బోర్లించిన తరువాత ద్రౌపదివద్దకు దుర్వాస మహాముని భోజనానికి రాగా ద్రౌపది కృష్ణుని ప్రార్థించింది. స్వామి కృపతో ద్రౌపది కష్టాన్ని పోగొట్టి దూర్వాసుని బారినుండి రక్షించాడు.


19. వజ్రమకుటధర గోవిందా : 

మకుటం అంటే కిరీటం. వజ్రమకుట ధర అనగా అతి విలువైన వజ్రాలు పొదిగి తయారుచేసిన కిరీటంను ధరించినవాడు - వేంకటేశ్వర స్వామి. పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ సందర్భంలో ఆకాశరాజు స్వామివారికి అత్యంత విలువైన  వజ్రకిరీటాన్ని సమర్పించాడు.


20. వరాహమూర్తి గోవిందా : 

వరాహం అంటే పంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఒక బంతిలాచేసి సముద్రంలో పడవేయగా, శ్వేతవరాహ రూపంలో భూమిని తన కోరలతో బయటకు తెచ్చాడు విష్ణువు, వరాహ స్వామివారు శ్రీనివాసుడు కొండపై నివసించడానికి వేంకటాద్రిపై స్థలాన్ని ఇచ్చాడు. అందుకే ముందుగా వరాహస్వామిని దర్శించి తర్వాతనే వేంకటేశ్వరస్వామిని దర్శించాలి.

21. గోపీజనలోలా గోవిందా : 

గోపీ జనులు అనగా గోపికలు లేదా గోపికా స్త్రీలు. వారియందు ప్రేమ కలిగినవాడవటంచేత గోపీజనలోలుడు అని పేరు. త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క అందానికి, ధర్మగుణానికి, మోహన రూపానికి ముగ్ధులయిన మహర్షులు శ్రీరాముని భర్తగా పొందుట ఎంత అదృష్టమోకదా అని అనుకున్నారు. అది గ్రహించిన శ్రీరాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారంలో మీ కోర్కె తీరగలదని అనుగ్రహించాడు. అందువల్ల ఆనాటి మహర్షులే ఈ గోపికా స్త్రీలు. నిరంతరం భగవన్నామ స్మరణ చేసే గోపికలంటే శ్రీకృష్ణునికి అమితమైన ప్రేమ. నిజానికి శ్రీకృష్ణుడు అస్కలిత (నిజమైన) బ్రహ్మచారి.

22. గోవర్ధనోద్ధార గోవిందా : 

అనగా గోవర్ధన పర్వతాన్ని చిటికెన వ్రేలుపై నిలిపినవాడు. పూర్వం దేవేంద్రుడు గోకులంపై రాళ్ళ వర్షం కురిపించాడు. ప్రజలను, గోవులను కాపాడటానికి శ్రీకృష్ణుడుగోవర్ధనపర్వతాన్ని గొడుగువలె (చిటికెన వ్రేలుతో) పైకి లేపి వారందరిని కొండ క్రింది భాగంలో ఉంచి కాపాడాడు, ఏడవ ఏట, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనగిరిని ఎత్తాడు.


23. దశరథనందన గోవిందా : 

అనగా దశరథ మహారాజు యొక్క కుమారుడని అర్థం. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాది రాక్షసుల సంహరం కొరకు శ్రీహరి దశరథునికుమారునిగా రామావతారాన్ని ధరించి ధర్మ సంస్థాపన చేశాడు. 

1.పితృవాక్య పరిపాలన, 2. సౌభ్రాతృత్వం (అనగా అన్నదమ్ముల మధ్య ప్రేమ) 3. ఏకపత్నీవ్రతం - అనగా ఒక భర్త, ఒకే భార్యను చేసుకొని వారి మధ్య ఉండవలసిన అన్యోన్యతను గురించి చాటి చెప్పటం. 4. ధర్మరక్షణ మున్నగు లక్షణాలను రామావతారంలో శ్రీహరి ఈలోకానికి చాటి చెప్పాడు.

24. దశముఖ మర్దన గోవిందా : 

దశముఖుడు అనగా రావణాసురుడు. శ్రీరాముడు రావణసంహారం చేశాడు కనుక దశముఖ మర్దనుడైనాడు. రావణాసురుని తమ్ముడైన విభీషణుడు శ్రీరాముని శరణు కోరాడు. మంచివాడైన విభీషణునికి రావణ సంహారానంతరం లంకా నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు.


25. పక్షివాహనా గోవిందా : 

పక్షిని వాహనంగా కలవాడు. గరుత్మంతుని వాహనంగా కలిగిన వాడగుటచేత శ్రీ మహావిష్ణువును పక్షివాహనా గోవిందా అని అంటారు.


26. పాండవప్రియా గోవిందా : 

అనగా పాండవులపై అమితమైన ప్రేమ కలిగినవాడు అని అర్థం. పాండురాజు కుమారులు 5 గురు. 1)ధర్మరాజు 2) భీముడు 3) అర్జునుడు 4) నకులుడు 5)సహదేవుడు. వీరిని పాండవులు అంటారు. వీరు ధర్మవర్తనులు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడలేదు. భగవంతుడు ధర్మ పక్షపాతి కనుక శ్రీకృష్ణునికి పాండవులంటే అమితమైన ప్రేమ..


27. మత్స్యకూర్మా గోవిందా : 

మత్స్యం అంటే చేప, పూర్వం సోమకా సురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్రంలోకి వెళ్ళాడు. అపుడు శ్రీ మహావిష్ణువు మత్యావతారాన్ని ధరించి సోమకాసురుని వధించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవునికిచ్చాడు. కూర్మం అనగా తాబేలు. దేవతలు, రాక్షసులు కలసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అను పామును త్రాడుగా చేసి పాల సముద్రంను చిలికేందుకు ప్రయత్నించగా మంధర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. అలా మునగకుండా ఉండటానికి శ్రీ మహావిష్ణువు పర్వతం అడుగు భాగంలో తాబేలు రూపంలో ఉండి అమృతం ఆవిర్భవించేందుకు కారకుడైనాడు. అందుకే మత్స్యకూర్మ గోవిందా.


28. మధుసూదనహరి గోవిందా : 

మధు అనే రాక్షసుని సంహరించిన వాడు కనుక మధుసూధనుడని అంటారు.


29. వరాహనృసింహా గోవిందా : 

వరాహం అనగా పంది. వరాహ రూపములో భూమిని హిరణ్యాక్షుడనే రాక్షసుని నుండి రక్షించాడు. నరసింహ అనగా సింహం తల, మెడ నుండి క్రింద పాదాల వరకు మనిషి ఆకారంలో ఉన్నవాడు. ప్రహ్లాదుని తండ్రి, రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుని సంహారం కోసం శ్రీహరి నరసింహ రూపంను ధరించవలసి వచ్చింది.

30. వామన భృగురామ గోవిందా : 

వామనుడనగా పొట్టివాడు. బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల భూమిని దానంగా తీసుకోవడానికి మహావిష్ణువు వామన రూపాన్ని ధరించాడు. ఒక అడుగుతో భూమి మొత్తాన్ని రెండవ అడుగుతో ఆకాశాన్ని మొత్తాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగును బలి చక్రవర్తి శిరస్సుపై పెట్టి పాతాళ లోకానికి పంపించాడు.

31. బలరామానుజ గోవిందా : 

అంటే బలరాముని యొక్క తమ్ముడు- శ్రీకృష్ణుడు అని అర్థం. వసుదేవ మహారాజు భార్య రోహిణీదేవి. రోహిణి కుమారుడు బలరాముడు. దేవకి కుమారుడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరామునికి తమ్ముడైనాడు.


32. బౌద్ధ కల్కిధర గోవిందా : 

కలియుగంలో అధర్మం బాగా పెరిగినపుడు మానవులను ధర్మ మార్గంలో నడిపించేందుకు బుద్ధుడుగా జన్మించి, తన బోధల ద్వారా మానవులలో సత్ప్రవర్తన కలుగునట్లు చేశాడు శ్రీహరి. కల్కి అవతారం కలియుగం చివరలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే శ్రీహరి అవతారం. కల్కి అవతారంలో హరి ఒక గుర్రంపై కూర్చోని కత్తిబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు.


33. వేణుగానప్రియ గోవిందా : 

అనగా కృష్ణుడు పిల్లనగ్రోవితోచేసే గానం. అది వినిపించగానే గోపికలు మాత్రమే కాకుండా ప్రతివారు ఆ గానామృతాన్ని ఆస్వాదించి, మైమరచిపోయే వారట. ఇంకా గోవులు కూడా వేణుగాన మాధుర్యాన్ని అనుభవించే వట. అందువలన  శ్రీకృష్ణునకు వేణుగాన ప్రియుడు అని పేరు.


34. వేంకటరమణా గోవిందా : 

వేంకటాచలంపై నిలిచియున్న శ్రీ మహావిష్ణువు కనుక వేంకటరమణా గోవిందా అని అంటారు.


35. సీతానాయక గోవిందా : 

సీత అనగా నాగలి చాలు. జనక మహారాజు యజ్ఞవాటిక కొరకు నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఒక పెట్టెలో లభించిన శిశువు కనుక సీత అని పేరు. తల్లి గర్భం నుండి గాక శ్రీ మహాలక్ష్మి భూమి నుండి ఆవిర్భవించింది. ఆమె భర్త దశరథ కుమారుడైన రాముడు కనుక సీతానాయకుడైనాడు.


36. శ్రిత పరిపాలక గోవిందా : 

శ్రితులు అంటే భగవంతుని ఆశ్రయించినవారు. తనను ఆశ్రయించిన వారి కోర్కెలను అడగకుండానే అనుగ్రహించేవాడు. ఆ విష్ణుమూర్తి, శ్రిత పరిపాలక గోవింద అంటే తనను ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడు తోడుగా వుండి వారి కోర్కెలను తీర్చే శ్రీహరి.


37. దరిద్రజనపోషక గోవిందా : 

దరిద్రం అంటే ఆర్థిక సంపద లేక పోవడం. భగవంతుని నమ్మిన వారికి కావలసిన అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. భక్త పోతనను అవమానించటానికి మహాకవి శ్రీనాథుడు అనేకమంది పండితులతో, స్నేహితులతో పోతన ఇంటికి భోజనానికి వస్తాడు. నిరుపేద స్థితిలో నున్న పోతన స్నానంచేసి రండి భోజనం తయారవుతుందని చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు. భగవంతుడు ఆవచ్చిన వారందరికీ సంతుష్టిగా భోజనం పెట్టి పంపించే ఏర్పాటు చేశాడు. అందుకే దరిద్ర జన పోషక గోవిందా అంటారు.


38. ధర్మ సంస్థాపక గోవిందా : 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ || భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు. అర్జునా...ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొంటాను. (అవతరిస్తాను). ధర్మో రక్షతి రక్షితః. ధర్మాచరణమే మనిషిని రక్షించ గలదు. ధర్మం నశించినపుడు ధర్మాన్ని ఉద్దరించుటకు భగవంతుడు అనేక రూపాలలో భూమిపై అవతరిస్తాడు. కనుకనే ధర్మ సంస్థాపక గోవిందా అన్నారు.


39. అనాథరక్షక గోవిందా : 

అంటే అవసరమైన సమయాలలో, కష్ట సమయాలలో ఎవరి నుండీ సహాయం పొందలేని వారిని అనాధలు అంటారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు భగవంతుడు తనను నమ్మిన వారికి తప్పక రక్షగా ఉంటాడు. అందుచేతనే అనాధ రక్షక గోవిందా అన్నారు.


40. ఆపద్బాంధవ గోవిందా : 

అంటే ఆపద నమయాలలో తలుచుకోగానే భగవంతుడు బంధువువలె ఆదుకుంటాడు.

ఉదా: కౌరవులు, పాండవులు జూదం ఆడగా జూదంలో పాండవులు తమ భార్య అయిన ద్రౌపదిని కూడా ఓడిపోయారు. దుర్యోధనుని సోదరుడైన దుశ్శాసనుడు నిండుసభలో పెద్దలందరూ చూస్తూవుండగా వివస్త్రను చేయటానికి ప్రయత్నించాడు ద్రౌపది శ్రీకృష్ణుడుకి మొర పెట్టుకోగా దుశ్శాసనుడు చీరలు లాగి లాగి అలసిపోయలా చేసాడు తప్ప ఆమెకు ఏమాత్రం హని జరగనీయ లేదు కనుక భగవంతున్ని ఆపద్భాందవుడు అంటారు.

41. శరణాగత వత్సల గోవిందా :

రావణాసురుని తమ్ముడైన విభీషణుడు తన అన్నగారితో 'సీతను శ్రీరామునికి ఇచ్చి క్షమించమని అడుగు, దీని ద్వారా లంకా నగరాన్ని, రాక్షస జాతిని కాపాడు' అని ఎంత చెప్పినా రావణుడు వినలేదు. అన్నను వదలి విభీషణుడు శ్రీరాముని శరణు వేడినాడు. శత్రువు తమ్ముడైనప్పటికీ శ్రీరాముడు విభీషణుని చేరదీసి రావణ సంహారానంతరం లంకా పట్టణానికి రాజుగా నియమించాడు. ఆవిధంగా శరణాగతవత్సలుడు అయినాడు శ్రీరాముడు.


42. కరుణాసాగర గోవిందా : 

కరుణ అంటే దయకల్గి ఉండటం. సాగరం అంటే సముద్రమని అర్థం. సముద్రం యొక్క లోతు, విస్తీర్ణము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క దయ కూడా మహా సముద్రంవలె చాలా విశాలంగా ఉంటుంది. కనుక భక్తులకు ఆయన కరుణాసాగరుడు


43. కమలదళాక్ష గోవిందా : 

కమల దళాలు అనగా తామర పూవు యొక్కరేకులు. అనగా విరిసిన తామర పూవుల రేకులవంటి విప్పారిన కన్నులు గలవాడు అని అర్థం. పువ్వులను చూడగానే మన మనస్సులు ఆహ్లాదం, ఆనందంతో నిండిపోతాయి. అటువంటి కన్నులు కల్గిన స్వామి యొక్క చల్లని చూపులు మనపై ప్రసరించగానే మన కష్టాలను, బాధలను మరచిపోయి ఆనందంగా ఉంటాము. అందువలన కమలదళాక్ష గోవిందా అన్నారు.


44. కామితఫలదా గోవిందా : 

కామిత ఫలదా అంటే కోరిన కోర్కెలు తీర్చే వాడు


45. పాప వినాశక గోవిందా : 

అంటే పాపం నుండి దూరం చేసేవాడు అనగా చేసిన పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. ఉదా. గౌతమ మహర్షి భార్య అహల్యను శిలగా ఉండమని శపించాడు. శ్రీరాముని పాదధూళి తగలగానే అహల్యకు శాపవిమోచనం కలిగి మళ్ళీ అహల్యగా మారింది. అందుకే పాప విమోచన గోవిందా.


46. పాహి మురారే గోవిందా : 

మురారి అంటే మురాసురుడు అనే రాక్షసుని సంహరించినవాడు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం శ్రీమన్నారాయణుని యొక్క కర్తవ్యం కనుక పాహిమురారే గోవిందా.


47. శ్రీముద్రాంకిత గోవిందా : 

శ్రీ అనగా లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని తన వక్షస్థలం పై ధరించిన వాడు కనుక శ్రీముద్రాంకిత గోవిందా.


48. శ్రీవత్సాంకిత గోవిందా : 

అనగా శ్రీవత్స లాంచనంను కలిగివున్నవాడు. భృగు మహర్షి శ్రీమహావిష్ణువును వక్ష స్థలంపై తన పాదంతో గట్టిగా తన్నగా విష్ణువు కోపింపక ఆయన యొక్క శ్రీపాదాలను భక్తితో పట్టి సేవించి ఆపాద చిహ్నాన్ని తన వక్షస్థలంపై ధరించాడని పురాణగాధ. అందుకే శ్రీవత్సాంకిత గోవిందా. శ్రీవత్సం అనుపుట్టుమచ్చ శ్రీహరికి త్రికోణాకారంలో తేనె రంగులో కుడి వక్షస్థలంపై ఉంటుంది.


49. ధరణీనాయక గోవిందా : 

భూనాయకుడు శ్రీనివాసుడు. వరాహ రూపంలో భూమిని కాపాడాడు. కనుక ధరణీనాయక గోవిందా అంటారు.


50. దినకరతేజా గోవిందా : 

దినకరుడు అంటే సూర్యుడు. సూర్యుడు స్వయం ప్రకాశ శక్తి కలవాడు. అలాగే గోవిందుడు కూడ సూర్యుని వలె మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ, భక్తులకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అందుకే దినకరతేజా అంటారు. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమకన్ను, సూర్య చంద్రుల ప్రకాశ శక్తి కలవారు గనుక దినకర తేజా గోవిందా..



51. పద్మావతీప్రియ గోవిందా : 

అంటే ఆకాశరాజ కుమార్తెను ఒక ఉద్యానవనంలో చూడగానే ఆమెను పరిణయమాడాలనే కోరిక కలిగి తన తల్లి వకుళమాత సహాయంతో పరిణయమాడి ఆమె యందు ప్రేమానురాగాలను కలిగియున్నవాడు శ్రీనివాసుడు గనుక అందుకే పద్మావతీ ప్రియ అన్నారు.


52 ప్రసన్నమూర్తి గోవిందా : 

ప్రసన్నమూర్తి అనగా ప్రశాంతమైన చిరునవ్వుతో ఉండేవాడు. భక్తులు భక్తితో ప్రార్థించినపుడు ప్రత్యక్షమవడం శ్రీ వేంకటేశ్వరుడు మందస్మిత వదనంతో ఉండటమేగాక భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు. కనుక ప్రసన్నమూర్తి గోవిందా అంటారు.


53. అభయహస్త ప్రదర్శన గోవిందా : 

అభయం, అనగా భయాన్ని పోగొట్టేది. ఎటువంటి, ఏ రకమైన, ఎవరివలనైనా సరే భయం కల్గినపుడు ఆ దేవదేవుని మనసారా స్మరించి తన భయాన్ని చెప్పుకోగానే స్వామి తన అభయ హస్తాన్ని చూపి ధైర్యాన్ని ప్రసాదించి కోర్కెలను తీరుస్తాడు. స్వామివారి కుడిచేతిలో అభయహస్తం చూపడంలోని ఆంతర్యం ఇదే.


54. మత్స్యావతార గోవిందా : 

అనగా శ్రీ మహావిష్ణువు చేప రూపము దాల్చుట. పూర్వం సత్యవ్రతుడు అనే రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఒక సం||ర కాలం నీరే ఆహారంగా తీసుకొంటూ శ్రీహరి ధ్యానంలో గడిపాడు. ఒకనాడాయన నదీ స్నానం చేసి హరి ప్రీతిగా జలతర్పణం చేసే సమయములో ఆయన దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల కనుపించింది. వెంటనే ఆయన ఆ చేప పిల్లను నదిలో వదిలాడు. అప్పుడు ఆ చేప పిల్ల రాజా! ఈ నదిలో పెద్ద చేపలు, చిన్న వాటిని కబళిస్తాయి నన్ను రక్షించమంది. ఆ రాజు అప్పుడు చేపపిల్లను తన కమండలంలో వేసుకొని ఇంటికి వచ్చెను. తెల్ల వారేసరికి ఆ చేప నాకు ఈ పాత్ర చాలలేదు అన్నది. అపుడు రాజు చేపను మరో పాత్రలో ఉంచాడు. వెంటనే ఆ పాత్ర కూడా చాలలేదు. తదుపరి కొలనులో ఉంచాడు. వెంటనే ఆకొలను కూడా చాలలేదు. చేప చాలా పెద్దగా అయింది. సముద్రంలో  అపుడు ఆ చేప రాజా! నన్ను మొసళ్ళ గుండంలో వదిలి వెళతావా అంది. అపుడు సత్యవ్రతుడు క్లేశంలో ఉన్న భక్తులను రక్షించటానికి ఈ అవతారం ధరించిన శ్రీహరీ నీకు నమస్కారం. ఈఅవతార కారణం తెలుసుకోవాలని ఉంది అనగా శ్రీమన్నారాయణుడు “రాజా! నేటికి 7 రోజులలో బ్రహ్మకు పగలు కావస్తున్నది. అపుడు ప్రళయం వస్తుంది. అపుడొక పెద్ద నావ వస్తుంది. దానిలో సర్వబీజాలు, ఓషధులు నింపి నువ్వు ఈ జలరాశిలో తిరుగుతూ ఉండు. అందులోనే సప్తర్షులూ నీతో ఉంటారు. దాని రక్షణభారం నాది. అందుకే ఈ అవతారం ధరించాను." అని పలికి శ్రీహరి అదృశ్యమయ్యాడు. 7వ రోజు బ్రహ్మ నిద్రలో ఉండగా వేదాలను సోమకాసురుడు అపహరించి సముద్రంలోనికి వెళ్ళాడు. అందరూ కూర్చున్న ఆ నావకు శ్రీహరి రక్షణ కల్పించి సోమకాసురుని చంపి వేదాలను తెచ్చి బ్రహ్మకిచ్చాడు. ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వివస్వతుడు అనే పేర వెలిగే సూర్యుని కుమారునిగా పుట్టి వైవస్వతమనువుగా ప్రఖ్యాతుడయ్యాడు. అందుకే మత్స్యావతారా గోవిందా అంటారు.


55. శంఖ చక్రధర గోవిందా : 

శ్రీ మహా విష్ణువు పాంచజన్యమనే పేరుగల దివ్య శంఖంను ధరించాడు. పాంచజన్యం పంచేంద్రియాలకు వాటికధిపతి అయిన మనస్సుకు చిహ్నం. అహంకారానికి మనస్సు నిలయం. కనుక శంఖం అహంకారతత్వంను సూచిస్తుంది. చక్రధర అనగాసుదర్శనమను చక్రాన్ని ధరించిన వాడగుటచే శ్రీపతి చక్రి అని పిలువబడుతున్నాడు.

సుదర్శనమనగా శుభదృష్టిని సూచిస్తున్నది. మానవుని చిత్తవృత్తిని సూచిస్తున్నది. శంఖచక్రధర అంటే అహంకారాన్ని తొలగించి శుభదృష్టిని ప్రసాదించేవాడని అర్థం. కనుక శ్రీహరిని శంఖచక్రధర గోవిందా అంటారు.

56. శాః గదాధర గోవిందా : 

శార్జ్ఞమను పేరుగల ధనస్సును శ్రీహరి ధరించాడు. ఇదికూడా మానవుని అహంకార తత్వంను సూచిస్తుంది. గధా ధర కౌమోదకీ అను పేరుగల గధను ధరించినవాడు శ్రీహరి. కౌమోదకం అనగా ఆనందంను కలిగించేది అని అర్థం. ఇది బుద్ధితత్త్వాన్ని సూచిస్తుంది. అందుచే శాఃగధాధర గోవిందా అన్నారు.

57. విరజా తీరస్థ గోవిందా : 

విరజానది అనగా గంగానది. వైకుంఠంలో శ్రీహరి పాదాలనుండి ఉద్భవించిన ఆకాశగంగకే విరజ అని పేరు .రామదాసుగా ప్రసిద్ధిగాంచిన కంచర్ల గోపన్న భద్రాచలంను ఇలా వర్ణించారు.


శ్రీరమ సీతగాగ, నిజ సేవక బృందము, వీర వైష్ణవాచార జనంబుగాగ, 

విరాజానది గౌతమిగావికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ, 

వసించు చేతనోద్దారకుడైన విష్ణువుడవు దాశరథీ కరుణాపయోనిధీ.
  • దశరథరామా! నీవు వైకుంఠమందున్న లక్ష్మీదేవిని ఇచ్చట సీతగా, అక్కడి నీ భక్తులు ఇక్కడ వీరవైష్ణవ జనులుగా వచ్చి పూజిస్తుండగా, అక్కడి విరజానది ఇక్కడ గోదావరిగా ప్రవహించగా ఆ వైకుంఠమే ఇక్కడ భద్రగిరి శిఖరంగా మారగా వేంచేసి ప్రాణికోటిని ఉగగసును, నీను ఆ మహా విసునే కాని వేరుకాదు అంటారు. 

  • విరజాతీర్ద అంటే గోదావరి ఒడ్డున ఉన్న మహావిష్ణువు అయిన  శ్రీరాముడే అని ఒక అర్థం. 

  • తిరుమల శ్రీవారి ఆలయం ప్రక్కనున్న స్వామి పుష్కరిణిలో విరజా తీర్థంతో పాటు అనేక తీర్థాలు నెలవై ఉంటాయని బ్రహ్మాండాది పురాణాలు చెప్తున్నాయి. 

  • విరజా తీర్థ ప్రవేశం ఉన్న స్వామి పుష్కరిణి తీరాన గోవిందుడు కొలువైవున్నాడు కనుక విరజాతీరస్థ గోవింద అంటారు. వైకుంఠంను చేరుటకు విరజానదిని దాటాలి.
58. విరోధి మర్దన గోవిందా : 

విరోధులు అనగా శత్రువులు. భగవంతునికి అందరూ సమానమే కదా. మరి శత్రువులు ఎవరుంటారు. అంటే ధర్మానికి విరుద్ధంగా నడిచేవారు, సజ్జనులను బాధించేవారు, సత్క్రియలకు ఆటంకం కలిగించేవారు, వేడుకగా జంతు హింస చేసేవారు, పతివ్రతలను కామించేవారు, సాధుశీలురను హింసించే వారు వీరంతా శ్రీహరికి శత్రువులే. పతివ్రత అయిన సీతను అపహరించి లంకలో ఉంచిన రావణాసురుడు దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించి వారికి పుట్టిన బిడ్డలను పుట్టగానే చంపిన కంసుడు లాంటి వాడు. ధర్మమార్గంలో నడుచు ప్రతి వారిని రక్షించుటకు స్వామి విరోధి మర్దనుడుగా అవతరిస్తాడు.

59.సాలగ్రామధర గోవిందా : 

అనగా సాలగ్రామ శిలారూపంను ధరించినవాడు. శ్రీమహావిష్ణువు ఏడుకొండలపై సాలగ్రామ శిలారూపంలో శ్రీనివాసునిగా కొలువై ఉన్నాడు. సాలగ్రామాలు

శ్రీమహావిష్ణు స్వరూపాలు. ఇవి గండకీ నదిలోనే లభిస్తాయి.

60. సహస్రనామా గోవిందా : 

సహస్ర అనగా వెయ్యి, నామాలు అనగా అనేకమైన నామాలు కల గోవిందా అని అర్థం


61. లక్ష్మీ వల్లభా గోవిందా :  

అనగా శ్రీ మహాలక్ష్మి భర్త అయిన శ్రీ మహావిష్ణువు అని అర్థం


62. లక్ష్మణాగ్రజ గోవిందా : 

లక్ష్మణుడు అన్న అయిన శ్రీరాముడు అని అర్థం


63. కస్తూరి తిలక గోవిందా : 

అనగా కస్తూరి తిలకంను ధరించినవాడని అర్థం. కస్తూరి జింక బొడ్డు నుండి వస్తుంది.


64. కాంచనాంబరధర గోవిందా : 

బంగారు వస్త్రాలను ధరించిన వాడని అర్థం .


65. గరుడ వాహన గోవిందా : 

అనగా గరుత్మంతుడు విష్ణుమూర్తి యొక్క వాహనము. కనుక గరుడ వాహన గోవిందా అంటారు.


66. గజరాజ రక్షక గోవిందా : 

అనగా ఏనుగుల యొక్క రాజును రక్షించిన వాడు అని అర్థం.


67. వానర సేవిత గోవిందా : 

అనగా కోతులచే సేవించబడిన వాడయిన శ్రీరాముడు అని అర్థం

68. వారధిబంధన గోవిందా : 

అనగా వారధిని నిర్మించిన వాడు అని అర్థం. లంకా నగరం ప్రస్తుతం శ్రీలంకగా పిలువబడుతున్నది. రావణుడు సీతను లంకలో ఉంచిన విషయం తెలిసిన తరువాత లంకను చేరడానికి మధ్యలో ఉన్న హిందూ మహాసముద్రం పైన ప్రస్తుత ధనుష్కోటి ప్రాంతం నుండి శ్రీలంక వరకు వానరుల సాయంతో వారధిని నిర్మించాడు. కనుక వారధిబంధన గోవిందా అన్నారు.

69. ఏడు కొండలవాడా గోవిందా : 

అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి అనేవి ఏడుకొండలు. ఏడు కొండల పైభాగంలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా వెలిశాడు కనుక ఏడుకొండలవాడా గోవిందా అన్నారు.


70. ఏకస్వరూపా గోవిందా : 

ఏక అనగా ఒక, స్వరూపం అనగా ఆకారం కలిగినవాడుఅని అర్థం. 


71. శ్రీరామకృష్ణా గోవిందా : 

శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయిన శ్రీ మహావిష్ణువు అని అర్థం


72. రఘుకుల నందనా గోవిందా : 

రఘుకులం అనగా రఘువంశం అని అర్థం నందన అనగా కుమారుడు శ్రీరాముడు రఘువంశంలో జన్మించాడు కనుక రఘుకుల నందనా గోవిందా అంటారు


73. ప్రత్యక్ష దేవా గోవిందా : 

ఉన్నది ఉన్నట్లు కనిపించడమే ప్రత్యక్షం శ్రీమహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా కన్పిస్తున్నాడు 


74.పరమ దయాకర గోవిందా: 

అంటే భక్తుల పట్ల మిక్కిలి దయ కలవాడు అయిన మహావిష్ణువు అని అర్థం


75. వజ్రకవచధర గోవిందా : 

అనగా వజ్రాలు పొదిగి తయారుచేసిన కవచంను ధరించినవాడని అర్థం. వజ్రాన్ని కోయడానికి వజ్రాన్నే ఉపయోగించాలి అంటారు. వజ్రం అభేధ్యమైనదని అర్థం. అటువంటి వజ్రకవచంను ధరించిన శ్రీహరిని ఎవరూ ఎదిరించలేరని కూడా అర్థం. అందుకే వజ్రకవచధర గోవిందా.


76. వైజయంతిమాల గోవిందా : 

వైజయంతి మాలను, రత్నాల హారాన్ని ధరించిన వాడు శ్రీహరి. కనుకనే వైజయంతిమాల గోవిందా అంటారు.


77. వడ్డీకాసులవాడ గోవిందా : 
  • లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞం చేస్తూ యజ్ఞహవిస్సును ఎవరికి సమర్పించాలి. హవిస్సును తీసుకొనేందుకు త్రిమూర్తులలో ఎవరికి అర్హత ఉన్నదో తెలుసుకోవాలని భృగుమహర్షిని పంపారు.

  • అతను సత్యలోకం వెళ్ళగా బ్రహ్మదేవుడు సరస్వతితోను,కైలాసం వెళ్ళగా శివుడు పార్వతితోను, వైకుంఠం వెళ్ళగా శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితోను సరస సల్లాపాలాడుతుండడం గమనించి ఆగ్రహించి తన కాలితో శ్రీహరి వక్షస్థలంపై కొట్టాడు. 

  • శ్రీహరి మహర్షి యొక్క కాలును తన రెండు చేతులలోనికి తీసుకొని నా వక్షస్థలంపై కొట్టడం చేత తమ కాలుకు నొప్పి కలిగినదా మహాత్మా అని అనునయించేమా మాట్లాడుతూనే అతని అరికాలులో ఉండే అహంకారమను కన్నును చిదిమేశాడు. 

  • వెంటనే భృగుమహర్షి తన తప్పును తెలుసుకొని శ్రీహరిని యజ్ఞహవిస్సును స్వీకరించవలసినది అని కోరుతూ శ్రీహరి శాంత గుణంను గూర్చి వేనోళ్ళ పొగిడి అక్కడి నుండి భూలోకానికి వచ్చేశాడు. 

  • ఇది చూస్తున్న లక్ష్మి తను నివసించే శ్రీహరి వక్షస్థలంపై తన్నిన మహర్షిని శిక్షించకపోవడంతో కోపగించి వైకుంఠంను వీడి భూలోకంలో కొల్హాపురానికి చేరి, శ్రీహరిని గూర్చి తపస్సు చేయనారంభించింది. 

  • శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో తాను ఉండలేక శ్రీమహా విష్ణువు భూలోకానికి వచ్చి తిరుమల కొండ ప్రాంతంలో ఒక పుట్టలో ఉండగా తెలుసుకున్న శ్రీమహాలక్ష్మి బ్రహ్మను ఆవుగా, శివుని దూడగా చేసి చోళరాజ్యా నికి వచ్చి ఆ ఆవును చోళరాజునకు అమ్మింది. 

  • ఆ ఆవు ప్రతి రోజూ పుట్టలోనున్న శ్రీహరికి తన పొదుగు నుండి పాలను కురిపించేది. దీనిని గమనించిన గోవుల కాపరి తన గొడ్డలితో ఆవు పై ఒక్క వేటు వేశాడు. గోవు పారిపోగా పైకి లేచిన శ్రీహరి తలపై తగిలింది.

  • తరువాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న వకుళమాత శ్రీహరి తన కుమారునిగా గుర్తించి ఆకాశరాజు కుమార్తెతో వివాహం నిశ్చయించింది. శ్రీహరి కుబేరుని వద్ద ధనం అప్పుతీసుకొని వివాహంచేసుకొన్నాడు. ఆ అప్పుకు వడ్డీగా కలియుగంలో భక్తులు సమర్పించే కానుకలన్నీ కుబేరునికి చెల్లిస్తున్నాడు.  కనుక వడ్డీ కాసులవాడ గోవిందా! అంటారు .

78. వసుదేవతనయా గోవిందా : 

దేవకీ వసుదేవులకు శ్రీమహావిష్ణువు కుమారుడై జన్మించటంవలన వసుదేవతనయా గోవిందా అన్నారు.


79. బిల్వపత్రార్చిత గోవిందా : 

బిల్వపత్రం అనగా మారేడు ఆకు. మారేడు ఆకులతో పూజింపబడటం శ్రీహరికి ప్రీతికరమైనది. శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామాలలో 77వ నామము “బిల్వ నిలయాయై నమః" అనగా బిల్వ దళాలలో శ్రీమహాలక్ష్మి వున్నది కనుక శ్రీమహా విష్ణువును బిల్వ పత్రార్చిత గోవిందా అంటారు.


80. భిక్షుకసంస్తుత గోవిందా : 

భిక్షుక వృత్తియనగా పూర్వకాలంలో కొందరు మునులు, గురుకులంలో విద్య నభ్యసించే శిష్యులు, గ్రామంలోనికి వెళ్ళి భిక్షను యాచించేవారు. ఆ వచ్చిన ధాన్యంతోనే ఆ రోజు ఆహారాన్ని తయారు చేసుకొని జీవించేవారు. వారికి కావలసిన ఆహార పదార్థాలు, ఇండ్లలో నిలువ చేసుకొనేవారు కాదు.ఆ మహర్షులు అలా జీవిస్తూ లోక కల్యాణార్థం తపస్సు చేయటం, యజ్ఞయాగాదులు నిర్వహించటం, నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ శ్రీహరి కథలను వింటూ, శ్రీహరి పూజలు చేస్తూ శ్రీహరి గీతాలను గానం చేస్తూ, శ్రీహరిని స్తుతిస్తూ నిరంతరం శ్రీహరి నామజపం చేస్తూ గడిపేవారు. అందుచేత భిక్షుక సంస్తుత గోవిందా అంటారు.

ప. నీకు మ్రొక్కెద అత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర, పంకజపత్ర నేత్ర
చిర శుభాకార, నిత్యలక్ష్మీ విహర
అవ్యయానంద, గోవింద, హరి, ముకుందా

81. స్త్రీపుంరూపా గోవిందా : 

అనగా స్త్రీ రూపం ధరించిన పురుషుడు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతాన్ని సాధించాలని మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అను సర్పరాజును త్రాడుగా చేసి దేవతలు 82. శివ కేశవమూర్తి గోవిందా : శివ అనగా శంకరుడు, కేశవ అనగా హరి. శివకేశవులు ఇరువురికి తేడా లేదు. అందుకే - 

“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః"
అని అన్నారు. కనుకనే శివకేశవమూర్తి గోవిందా అన్నారు.

83. బ్రహ్మాండరూపా గోవిందా : 

చాలా గొప్పదిగా వున్న రూపం.నామరూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి విస్తరించి,విరాజిల్లుతూ కనిపిస్తున్న సర్వ ప్రపంచానికి పరబ్రహ్మయే కారణమగుటచే, పరమాణువు నుండి మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండివున్న వాడగుటచే బ్రహ్మాండరూపా అంటారు.


ప. హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరి మయముగాని, ద్రవ్యము
పరమాణువు లేదు వంశపావన వింటే. అని భాగవతం చెబుతున్నది. 

ఈ విశ్వమంతా భగవానుని విరాట్స్వరూపమేనని గీతాచార్యుడు శ్రీకృష్ణుడు బోధించాడు. భూలోక,భువర్లోక,సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే ఇవి 7 ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల,మహాతల, పాతాళలోకాలు అనే ఈ 7 అధోలోకాలు. ఈ 14లోకాలు ఒక బ్రహ్మాండం. మహాత్మునకు భూమి పాదాలు, ఆకాశం నాభి,వాయువే ప్రాణం, సూర్యచంద్రులే నేత్రాలు, స్వర్గమే శిరస్సు. అగ్నియే ముఖం, సముద్రమే దివ్య మందిరం. ఏ మహామూర్తి యందు అనంత విశ్వం భాసిల్లుచున్నదో, దేవతలు, నరులు, పక్షులు, గోవులు, సర్పాలు, గంధర్వులు, దైత్యులు మున్నగు వారితో ఆయా లోకాలలో గూడి, చిత్ర, విచిత్రంగా శోభిల్లుచున్నవో మరియు ఎవ్వడు మూడు లోకాలను తన శరీరంగా కలిగివున్నాడో అట్టి సర్వవ్యాపి, సర్వేశ్వరుడును అగు ఆ సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాను ఈ పరబ్రహ్మం సదా మనకు తోడై ఉండి ఆత్మ జ్ఞాన బోధ చేయుచు మనలను రక్షించు గాక అందుకే బ్రహ్మాండరూపా గోవిందా అన్నారు


84. భక్త రక్షక గోవిందా : 

అనగా భక్తితో ప్రార్థించే వారిని రక్షించేవాడు అని అర్థం


85. నిత్యకల్యాణ గోవిందా : 

కల్యాణం అనగా శుభాన్ని కల్గించునది. శ్రీహరి నామం ఎక్కడ నిత్యం వినిపిస్తుందో అక్కడ నిత్యం శుభాలే జరుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రతిరోజు కల్యాణోత్సవ కైంకర్యాన్ని నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూంది. స్వామివారు నిత్యకల్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతున్నారు. లోకకల్యాణం కొరకు శ్రీహరి నిత్యకల్యాణోత్సవాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కనుకనే నిత్యకల్యాణ గోవిందా అని భక్తులచే కీర్తింపబడుతున్నాడు.


86. నీరజనాభా గోవిందా : 

నీరజం అనగా నీటి నుండి పుట్టిన తామరపువ్వు, నాభి అనగా బొడ్డు. శ్రీహరి యొక్క నాభి నుండి తామరపువ్వు ఉద్భవించగా, ఆ తామర పువ్వు నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ సృష్టి కార్యాన్ని జరుపుతున్నాడు. కనుకనే శ్రీహరికి నీరజనాభుడు, కమలనాభుడు పద్మనాభుడు అనే పేర్లు వచ్చాయి.


87. హాథీరామ ప్రియ గోవిందా : 

హాథీరామ బాబా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు. తిరుమలలో ఆనందనిలయాన్ని దర్శిస్తూ నిరంతరం స్వామి ధ్యానంలోనే గడిపేవాడు. స్వామి సర్వాంతర్యామి ఎవరి హృదయం ఎటువంటిదో గ్రహించగలడు కనుక హాథీరామబాబా తనను నిరంతరం స్మరించుటచే అప్పుడప్పుడు వచ్చి బాబాతో స్వామివారు సంభాషించేవారు. హాథీరామబాబా స్వామితో ఎంతసమయం గడిపినా అతని మనస్సు ఆనందంగానే ఉండేది. అలాగే బాబాతో పాచికలు ఆడుతూ ఉండేవాడు. భక్తులను నిరంతరం భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు కదా! ఆనోట ఈనోట ఈ వార్తను విన్న అర్చకులు హాథీరాంబాబ అసత్య ప్రచారం చేస్తున్నాడన్న నెపంతో అతనిని పిలిపించి నీవు భక్తుడవైతే, స్వామివారు పాచికలాడేందుకు నీ వద్దకు రావడం సత్యమైతే ఒక టన్ను చెరకు తెల్లవారేసరికి తినమని అన్నారు. చెరకును అక్కడ పెట్టి వారు వెళ్ళారు. బాబా శ్రీవారిని ధ్యానిస్తూ కూర్చున్నాడు. స్వామి వారు ఏనుగు రూపంలో వచ్చి చెరకు మొత్తం తిన్నారు. ఇది గమనించిన పూజారులు స్వామి భక్తవత్సలుడని, అందుకే హాథీరాముణ్ణి అనుగ్రహించాడని భావించారు. అందుకే హాథీరామప్రియ గోవిందా !


88. హరిసర్వోత్తమ గోవిందా : 

కలియుగంలో మానవులు శరీరబలం లేని నీరసులు, ధైర్యశూన్యులు అనగా ధైర్యం లేనివారు, మందబుద్ధులు అనగా తెలివితక్కువవారు, అల్పకాల జీవులు అనగా తక్కువ ఆయుషుగలవారు, దుర్భరులు అనగా బలం లేనివారు. ఈ దశలో వారికి సత్కార్యాలు, సత్రతువులు చేసే శక్తి ఉండదు. అటువంటివారు తరించాలంటే హరి నామస్మరణం, హరికథా శ్రవణం ఈ రెండే మార్గాలు. అందువలననే హరిసర్వోత్తమ గోవిందా అన్నారు. శ్రీహరి సర్వవ్యాపి. బ్రహ్మాది దేవతలందరిలోకి ఉత్తముడు. ఎవరు ఏ వరాలిచ్చినా ఆ వరాలు అనర్థాలకు దారితీయకుండా కాపాడేవాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి శ్రీహరి అవతారమైన శ్రీరామ అవతారంలోని రామ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీహరిని కీర్తించాడు. అటువంటి సర్వోత్తముడు శ్రీహరి. అందుకే హరి సర్వోత్తమ గోవింద అంటారు.


89. జనార్దనమూర్తి గోవిందా : 

కేశవ నామాలలో జనార్దనమూర్తి అనునది ఒక నామము. అందుకే జనార్దనమూర్తి గోవిందా అన్నారు.


90. జగత్సాక్షి రూపా గోవిందా : 

అనగా సృష్టిలోని ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోను శ్రీహరి ఉన్నాడు. అన్నిటికి ఆయనే సాక్షి, కనుక ఆయనను జగత్సాక్షిరూపా గోవిందా అన్నారు. 


91. అభిషేకప్రియ గోవిందా : 

అనగా ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పండ్ల రసాలు, గంధం, మొదలగు పదార్థాలతో అభిషేకమంటే శ్రీహరికి చాలా ఇష్టమైన పూజా విధానం కనుక

అభిషేక ప్రియ గోవిందా అంటారు.

92. ఆపన్నివారణ గోవిందా : 

అనగా ఆపదలనుండి రక్షించువాడు గోవిందుడు అని అర్థం. 


93. రత్నకిరీట గోవిందా : 

నవరత్నాలతో చేయబడిన కిరీటంను ధరించుటచే స్వామికి రత్నకిరీట గోవిందా అన్నారు.


94. రామానుజనుత గోవిందా : 

రామానుజుడు విశిష్టాద్వైత మతోద్దారకుడు. దీనిలో భాగంగా అతను విష్ణువును స్తుతించుటచే రామానుజనుత గోవిందా అని అన్నారు. రామ అనుజ అంటే రాముని తమ్ముడు అని అర్థం. త్రేతాయుగంలో శ్రీరాముడు లక్ష్మణునిచే సేవింపబడినవాడు, పూజింపబడినవాడు, గౌరవించ బడినవాడు. కనుకనే రామానుజనుత గోవిందా!


95. స్వయం ప్రకాశ గోవిందా : 

సూర్యుని ఎవ్వరూ వెలిగించరు. తనంత తానుగా ప్రకాశిస్తాడు. స్వయం ప్రకాశం కలవాడు. అలాగే స్వామి కూడ స్వయం ప్రకాశకుడు కనుక స్వయంప్రకాశ గోవిందా అన్నారు.

శ్రీ గోవిందనామ వైభవం

96. ఆశ్రితపక్ష గోవిందా : 

అనగా ఆశ్రయించిన వారి పక్షాన ఉండేవాడు. భూదేవి కుమారుడు నరకుడు. వీడు బల, మద, గర్వంతో అదితి కుండలాలు హరించాడు. వరుణ దేవుని ఛత్రం అపహరించాడు. మణి పర్వతం ధ్వంసం చేశాడు. దేవతలను, ఋషులను, మానవులను బాధించాడు. ఈ బాధలు భరించలేక దేవేంద్రుడు వాసుదేవునికి మొరపెట్టుకున్నాడు. నరకాసురుని వధించటానికి శ్రీకృష్ణుడు బయలుదేరే సమయంలో సత్యభామ కూడ వాసుదేవునితో యుద్ధానికి బయలుదేరింది. వద్దని వారించినా వినలేదు. రథాన్ని అధిరోహించి నరకుని పట్టణం ప్రగ్యోతిష నగరానికి చేరారు. పాంచజన్యం పూరించి ముందుగా మురాసురుడు అనే రాక్షసుని హతమార్చారు. తరువాత నరకునితో యుద్ధం చేసి సంహరించాడు మునుల,ఋషుల, మానవుల బాధలను తొలగించాడు అందుకే ఆశ్రిత పక్షపాత గోవిందా అని అన్నారు


97. నిత్య శుభప్రద గోవిందా : 

ప్రతిరోజు శుభాలను ప్రసాదించే వాడని అర్థం. ఎల్లప్పుడు దేవుని స్మరించి కార్యక్రమాలు చేపడితే, దేవుడు తోడుగా ఉండి, విజయాలను ప్రసాదిస్తాడు. అందువలన నిత్యశుభప్రద గోవిందా అంటారు. శాశ్వత సుఖంను ఇచ్చువాడు గనుక నిత్యశుభప్రద అంటారు.


98. నిఖిలలోకేశా గోవిందా : 

అన్ని లోకాలకు అధిపతి, సర్వాంతర్యామి అగుటచేత శ్రీహరిని నిఖిల లోకేశా గోవిందా అంటారు.


99. ఆనందరూపా గోవిందా : 

శ్రీనివాసుడు ఎల్లపుడు మందస్మిత సుందర వదనారవిందుడు. అనగా నవ్వురాజిల్లెడు మోమువాడు అందుచేత ఆనందరూపా గోవిందా అంటారు.


100. ఆద్యంతరహితా గోవిందా : 

ఆది అనగా మొదలు, అంతం అనగా చివర, మొదలు చివర లేనివాడు ఎల్లపుడు ఉండేవాడు సర్వకాల

సర్వావస్థలయందు ఉండేవాడు అని అర్థం.

101. ఇహపరనాయక గోవిందా : 

ఇహ అనగా ఈ భూలోకం. పరం అనగా పరలోకం. ఈ రెండు లోకాలకు అధినాయకుడు శ్రీహరి. కనుకనే ఇహపరనాయక గోవిందా అంటారు.


102. ఇభరాజరక్షక గోవిందా : 

ఇభం అనగా మదపుటేనుగు. ఇభరాజు రక్షక అనగా గజరాజును రక్షించిన వాడు అని అర్థం.


103. పరమదయాళు గోవిందా : 

అనగా మిక్కిలి దయగలవాడని అర్థం. సీతను రావణాసురుడు తీసుకొని వెళ్ళిన తరువాత సీతాన్వేషణలో రామలక్ష్మణులు క్రమంగా పంపానదీ తీరంచేరారు. నెమ్మదిగా ఆశ్రమ ద్వారం దాటి ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా ఉన్న శబరి వీరిని చూస్తూనే చేతులు జోడించి పాదాభివందనం చేసి, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, గౌరవించింది. శ్రీరామునికి తినటానికి పండ్లనిస్తూ ఒక్కొక్క పండూ శబరి తిని రుచిచూసి తియ్యనిపండ్లను మాత్రమే రామలక్ష్మణులకు తినటానికి ఇచ్చింది. శ్రీరాముడు శబరి ఇచ్చిన పండ్లను ప్రేమతో స్వీకరించాడు. లక్ష్మణుడు అన్నవైపు చూడగా చిరునవ్వు నవ్వాడు. భక్తితో సమర్పించిన వానిని స్వామి దయతో స్వీకరిస్తాడు. కనుక పరమ దయాళు గోవిందా అంటారు.


104. పద్మనాభ హరి గోవిందా : 

నాభియనగా బొడ్డు. పద్మమును నాభియందు కలవాడు కనుక పద్మనాభ హరి గోవిందా అంటారు. పద్మనాభుడు అన్నా, కమలనాభుడు అన్నా శ్రీహరియే.


105. తిరుమలవాసా గోవిందా : 

తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడను పేరుతో శ్రీహరి కొలువై వుండడం చేత తిరుమల వాసా గోవిందా అంటారు.


106. తులసీ వనమాల గోవిందా : 

తులసీ దళములచే తయారు చేయబడిన దండలు అనిన శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. కనుక తులసీ వనమాలా గోవిందా అంటారు.


107. శేషాద్రినిలయా గోవిందా :

అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, వేంకటాద్రి, గరుడాద్రి, శేషాద్రి అను ఏడుకొండలపై నిలచిన  వేంకటేశ్వరుడు  కనుక శేషాద్రినిలయా గోవిందా అంటారు.


108. శేషశాయి గోవిందా : 

శ్రీహరి ఆదిశేషునిపై పవళిస్తాడు. కనుకనే శేషశాయి గోవిందా అంటారు.


ఈ 108 గోవిందనామాలచే కొనియాడబడుతున్నవాడు గోవిందుడు, ఈ గోవిందనామాలన్నీ చదివిన వారికి, విన్నవారికి వీడియో  చూసిన వారికీ  అందరికీ సర్వకాల సర్వావస్థల యందు శ్రీహరి తోడై వుండి సర్వులనూ రక్షించి సర్వ సుఖాలు అందించుగాక.

గోవిందా నామాలు వీడియో bdl 1tv 


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ లలో గోవిందా నామాలు చూడండి 
Todays Quote:

"Success means doing the best we can with what we have. Success is the doing, not the getting; in the trying, not the triumph. Success is a personal standard, reaching for the highest that is in us, becoming all that we can be."

-Zig Ziglar


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి