25, నవంబర్ 2020, బుధవారం

20 కార్తీక పురాణము విశిష్టత - ఇరవైవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

20 కార్తీక పురాణము విశిష్టత - ఇరవైవ రోజు పారాయణ 


తొమ్మిదవ అధ్యాయం


 పృథుచక్రవర్తి అడుగుతున్నాడు: 

మహర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని శలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' లాంటి పేర్లతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు'నారదుడు చెబుతున్నాడు:  శ్రద్ధగా విను. 

పూర్వం ఒకసారి, ఇంద్రుడు సమస్త దేవత, అప్సర సమేతుడై శివదర్శనం కోసం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు వేతాళరూపి అయి ఉన్నాడు. భీతవహ దంష్ట్రానేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివుడిగా గుర్తించలేక 'ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.  కాని, ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వకపోవడంతో కోపం తెచ్చుకున్న ఇంద్రుడు 'నా పశ్నలకు జవాబు ఇవ్వని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను' అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయింది కాని, ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తినుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో, దేవగురువు అయిన బృహస్పతి ఆ వేతాళ స్వరూపం శివుడే అని గ్రహించి - ఇంద్రుని చేత అతనికి మ్రొక్కించి, తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు


బృహస్పతి కృత వేతాళ శాంతి స్తోత్రము


శ్లో      నమో దేవదిదేవాయ త్ర్యంబకాయ కపర్థినే
         త్రిపురఘ్నాయ శర్వాయ నమో ధ నిఘాదినే 


శ్లో     నిరూప యదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే 
        యజ్ఞవిధ్వంసక యజ్ఞానాం ఫలదాయినే 


శ్లో     కాలంత కాలకాలాయ కాలభోగి ధరాయచ 
         
నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యయ నమో నమః 

  • బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు - ముల్లోకదాయకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించడానికి నిశ్చయించుకుని 'బృహస్పతీ! నా కోపం నుంచి   ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచీ నువ్వు 'జీవ' అనే పేరుతొ ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు. 
  • ఆ మాట మీద బృహస్పతి 'హే శివా! నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదేవేశుణ్ణి, త్రిలోకాలను కూడా నీ మూడోకంటి మంటనుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి - ఇదే నా కోరిక' అన్నాడు.

  • సంతసించిన సాంబశివుడు 'వాచస్పతీ! నా ముక్కంట వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా, నీ ప్రార్థనను మన్నించి ఆ అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమంలో పడి అగ్ని బాలకరూపాన్ని ధరించింది. 
  • పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగుపరుగున సముద్రుడివద్దకు వచ్చి - 'ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు?' అని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి 'గంగా సంగమంలో జన్మించాడు గనుక, ఇతను నా కుమారుడే. దయచేసి వీడికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరుకున్నాడు. 

  • ఈ మాటలు జరిగే లోపలేఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడిపట్టునుంచి తన గెడ్డం వదిలించుకోవడానికి బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. అందువల్ల విధాత 'ఓ సముద్రుడా! నా కళ్ళనుండి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేరు ప్రఖ్యాతుడు అవుతాడు.' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. 

  • ఆ జాలంధరుడికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, జలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానావాచార్యుడు అయిన శుక్రుడి సహాయంతో సముద్రంనుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.

తొమ్మిదవ అధ్యాయం సమాప్తం 

పదవ అధ్యాయం

నారదుడు చెబుతున్నాడు

పూర్వం దేవతలచే హతమారి పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరున్ని ఆశ్రయించి, నిర్భయంగా తిరగసాగారు. ఆ జలంధరుడు ఒకరోజు, శిరోవిహీనుడైన (శిరస్సు లేని) రాహువుని చూసి 'వీడికి తల లేదు ఏమిటి?' అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయడం - మొదలైన ఇతిహాసం అంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడు అయిన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రున్ని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడు అనే వాణ్ని దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి 'నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను 'దేవేంద్రా! నా తండ్రి అయిన సముద్రున్ని పర్వతంతో మదించి అపహరించిన రత్నాలు అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు' అది విన్న అమరేంద్రుడు 'ఓ రాక్షస దూతా! గతంలో నాకు భయపడిన లోకకంటకాలయిన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే, గతంలో శంఖుడు అనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుడిచేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మధన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. ఘస్మరుడు, జలంధరుడి దగ్గరకు వెళ్ళి, దేవేంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు - మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ-నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలాపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారూ మునల పరిషు బాణ గదాద్యాయుదాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాశ్వాదిక శవాలతోనూ, రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులను అందరినీ 'మృతసంజీవనీ' విద్యతో బ్రతికించేస్తుండగా = దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను, ద్రోణగిరిమీద దివ్యౌషథాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో - అప్పుడు బృహస్పతి దేవతలను చూసి 'ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి, మనకు జయింప శక్యంగాకుండా వున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి' అని హెచ్చరించాడు. అది వినగానే భీతావహులైన దేవతలు అందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాళలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు - ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై, శంబు-నిశంబాదులను తన వ్రతవిధులుగా నిర్ణయించి, పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు.


తొమ్మిది, పదవ అధ్యాయాలు సమాప్తం

ఇరువైవ (బహుళ పంచమి)  పారాయణం సమాప్తం

ఇరువైవ రోజు వీడియో యు. ఆర్. యల్.లు చూడండి


Note:  నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like, share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.





24, నవంబర్ 2020, మంగళవారం

19 కార్తీక పురాణము విశిష్టత - పందొమ్మిదవ రోజు పారాయణ

wowitstelugu.blogspot.com

19 కార్తీక పురాణము విశిష్టత  - పందొమ్మిదవ రోజు పారాయణ

ఏడవ అధ్యాయం

నారదుడు చెబుతున్నాడు: పృథుభూపాలా! కార్తీక వ్రతస్థుడు అయిన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను.


 కార్తీక వ్రతస్థులకు నియమాలు

  • ఈ వ్రతస్థుడు మాంసము, తేనే, రేగుపండ్లు, నల్లఆవాలు, ఉన్మాదకాలను తినకూడదు. పరాన్నభుక్తి-పర ద్రోహం, దేశాతనాలు విడిచిపెట్టాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. 
  • దేవ బ్రాహ్మణ గురురాజులను, నువ్వులనూనెను, విక్రయ అన్నము, నింద్యవంజనయుక్త భోజనము, దూషితాహారము విదిచిపెట్టాలి. 
  • ప్రాణి సంబంధిత హీనదాన్యాలను, చద్ది అన్నాన్ని తినకూడదు. మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల అమీష సంబంధిత క్షీరాలు స్వీకరించకూడదు. 
  • బ్రాహ్మనులచే అమ్మబడే రసాలను భూజాతలవణాలను విసర్జించాలి. రాగిపాత్రాలలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో వుండే నీళ్ళు, దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడూ మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి వీటిని విసర్జించాలి. 
  • బ్రహ్మచర్యాన్ని, భూశయనాన్ని(నేలపై పడుకోవడం) ఆకులలోనే భోజనం చేయాలి. నాలుగవఝామున భుజించడమే శ్రేష్ఠం. 
  • ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్థశినాడు తప్ప మిగిలిన దీక్షాదినాలలో త్రైలాభ్యంగనం చేయకూడదు. 
  • విష్ణువ్రతం చేసేవాళ్ళు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయాలను విసర్జించాలి. బహిష్టలతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రత భ్రష్టులతోనూ, వేదత్యక్తులతోను సంభాషించకూడదు.  
  • అటువంటివారి ఎంగిలికాని, కాకులు తాకిన ఆహారాన్ని గాని, మాడుపట్టిన అన్నాన్ని గాని తినకూడదు. 
  • తన శక్తికొలది విష్ణు ప్రీతికి క్రుచ్చాదులు చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, ఆనప, చేదుపోట్ల, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమ్యాదిగా పరిత్యజించాలి. 
  • ఇవేగాక ఇంకా కొన్నిటిని కోడా విసర్జించాలి. మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. ఈ కార్తీకమాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి. 
  • కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగులా పారిపోతారు. 
  • వంద యజ్ఞాలు చేసినవాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కాని, కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు. 
  • కాబట్టి యజ్ఞయాగాదులు కన్నా కార్తీకవ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా! భూలోకంలో వున్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా కార్తీక వ్రతస్థుడి శరీరంలోనే వుంటాయి. విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాదులు అందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు. 
  • విష్ణు వ్రతాచరణాపరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో, అక్కడినుండి గ్రహ, భూత, పిశాచగణాలు పలాయనాన్ని పాటిస్తాయి. 
  • యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. 
  • ఈ కార్తీక వ్రతాన్ని విడువకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు.


ఏడవ అధ్యాయం సమాప్తం

ఎనిమిదవ అధ్యాయం


ప్రజారంజనశీలా! పృథునృపాలా! ఇక, ఈ కార్తీకవ్రత ఉద్యాపన విధిని వివరంగా చెబుతున్నాను విను. 

ఉద్యాపన విధి 

  • విష్ణు ప్రీతికోసమూ, వ్రత సాఫల్యత కోసమూ కార్తీకశుద్ధ చతుర్థశినాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. 

  • తులసిని స్థాపించి దానిచుట్టూ తోరణాలు ఉన్నది, నాలుగు ద్వారాలు కలది, పుష్పవింజామరలతో అలంకరిపబడినది అయిన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 

  • నాలుగు ద్వారాల దగ్గర సుశీల, పుణ్యశీల, జయ, విజయులు అనే నలుగురు ద్వారపాలకులను మట్టితో ఏర్పాటుచేసుకుని వారిని ప్రత్యేకంగా పూజించాలి.

  • తులసి మొదట్లో నాలుగురంగులు గల ముగ్గులతో 'సర్వతోభద్రం' అనే అలంకారాన్ని చేయాలి. దానిపై పంచరత్న సమానమైన కొబ్బరికాయతో కూడిన కలశం ప్రతిష్టించి, శంఖచక్ర గదా పద్మధారీ పీతాంబరుడు లక్ష్మీసమేతుడూ అయిన నారాయణుడిని పూజించాలి. 
    ఇంద్రాది దేవతలను ఆయా మండలాలలో అర్చించాలి. శ్రీమహావిష్ణువు ద్వాదశిరోజున నిద్రలేచి, త్రయోదశియందు దేవతలకు దర్శనం ఇచ్చి, చతుర్థశినాడు పూజనీయుడై ఉంటాడు కనుక, మానవుడు ఆ రోజున నిర్మలచిత్తుట్టుడై ఉపవాసం వుండి, విష్ణుపూజను విధి విధానంగా ఆచరించాలి. 

  • గురువుయొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపంలో ఆవాహన చేసి, షోడసోపచారాలతోను పూజించి, పంచభక్ష్య భోజ్యాలను నివేదించాలి. గీతాలు, వాయిద్యాలతో మంగళ ధ్వనులతో ఆ రాత్రి జాగరణ చేసి, మరుసటిరోజు ప్రాతఃకాలకృత్యాలు నెరవేర్చుకుని, నిత్యక్రియాలను ఆచరించాలి. 

  • తరువాత నిష్కల్మషంగా హోమం చేసి, బ్రాహ్మణ సమారాధన చేసి, యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్థశినాడు ఉపవాసం చేసినవాడు, విష్ణుపూజ చేసినవాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు. 

  • తరువాత పూర్ణిమనాడు శక్తిగలవాడు ముప్పై దంపతీ పూజలను ఆ శక్తులను కనీసం ఒక్క దంపతీ పూజ అయినా చేసి, వ్రతనాధునకు దేవతలకు తులసికి పునః పూజ చేసి, కపిలగోవును అర్పించాలి. 

  • ఆ తరువాత ...'ఓ బ్రాహ్మణులారా! మీరు సంతోషించుటచేత నేను విష్ణువు అనుగ్రహమును పొందెదనుగాక! ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మలలోని నా పాపాలు నశించుగాక! నా కోరికలు తీరునుగాక! గోత్రవృద్ధి స్థిరమగుగాక! జీవితాంతాన దుశ్శక్యమైన వైకుంఠవాసం లభించుగాక! అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి. 

  • ఆ తరువాత  వారి చేత తథాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి, బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇవ్వాలి. 

  • ఆ తరువాత సజ్జనులతో కూడినవాడై భోజనాదులు పూర్తి చేసుకోవాలి.

పందొమ్మిదవ (బహుళ చవితి)రోజు పారాయణ సమాప్తం

ఏడవ, ఎనిమిదవ అధ్యాయాలు సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్.ల లో పందొమ్మిదవ రోజు 

 పారాయణ చూడండి


Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి.

18 కార్తీక పురాణము విశిష్టత - పద్దెనిమిదవ రోజు పారాయణం

wowitstelugu.blogspot.com

కార్తీక పురాణము విశిష్టత  - పద్దెనిమిదవ రోజు పారాయణం


ఐదవ అధ్యాయం 

నారదుడు చెప్పినది అంతా విని పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసం ఉత్కృష్టతను వివరించి చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. అదే విధంగా స్నానం మొదలిన విధులు, ఉద్యాపన విధిని కూడా యధావిధిగా తెలియజేయవలసింద'ని కోరగా నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.

కార్తీక వ్రత విధి విధానాలు - శౌచం


శ్లో ||     ఆశ్విన్యస్యతు మాఎస్య యా శుక్లైకాదశ భవేత్!
 
          కార్తికస్య వ్రతారంభం తస్యాం కుర్యా దంతంద్రితః!!

  • మహారాజా! ఈ కార్తీక వ్రతాన్ని నిరాలసుడూ, జాగారూకుడూ అయి ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశీ నాడే ప్రారంభించాలి. 
  • వ్రతస్థుడు అయినవాడు తెల్లవారుఝామునే లేచి, చెంబుతో నీళ్ళు తీసుకుని, తూర్పుదిశగాగాని, ఉత్తరదిశగాగాని ఊరి బయటకు వెళ్ళి, యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని, ముఖాన్ని నియమించి, ఉమ్మివేయడం మొదలయినవి చేయకుండా మూత్ర పురీశాలను విసర్జించాలి. 
  • పగలుగాని, సంధ్యలోగాని యీ ఉత్తరాభిముఖంగా, రాత్రిపూట అయితే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తిచేసుకోవాలి. తరువాత మూవ్రయాన్ని చేతబట్టుకుని మట్టితోటి, నీళ్ళతోటి  శుభ్రం చేసుకుని, లింగంలో ఒకసారి, గుదలో మూడుసార్లు నీళ్ళతోనూ, రెండుసార్లు మట్టితోను శరీరం అంతా ఐదుసార్లు, లింగంలో పదిసార్లు నీళ్ళతోనూ, రెండింటిలోను మట్టితో ఏడుసార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచవిధి చెప్పబడి వుంది. 
  • ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు, వానప్రస్థులకు మూడురెట్లు, యతులకు నాలుగురెట్లుగా నిర్ణయించబడింది. ఇది పగలుజరిపే శౌచం, ఏ ఆశ్రమం వాళ్ళు అయినా సరే రాత్రిపూట యిందులో సగం ఆచరిస్తే చాలు. 
  • ఆతృతాపరులు అయినవాళ్ళు అందులో సగం, ప్రయాణాలలోనో, మార్గమధ్యంలోనో వున్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి. ఈ విధంగా శౌచకర్మ చేసుకోనివాళ్ళు ఆచరించే కర్మలేవీ కూడా తత్ఫలాలు ఇవ్వవు. 

దంతధావనం 

  • ముఖమార్జనం చేయనివాళ్ళకు మంత్రాలు పట్టు ఇవ్వవు. కాబట్టి దంతాలనూ, జిహ్వానూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 
                 మంత్రం ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశపమాని చ!
                 బ్రహ్మ ప్రజ్ఞాం చ మేథాం చ త్వన్నో దేహివసస్పతే !!
  • అనే మంత్రం పఠిస్తూ ఫాలవృక్షం యొక్క పన్నెండు అంగుళాల శాఖతో దంతదావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, షష్ఠి, సప్తమి, సూరచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. 
  • ముళ్ళచెట్లు, ప్రత్తి, వావిలి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. 
  • దంతధావనం తరువాత, భక్తీ-నిర్మలబుద్ధీ కలవాడై, గంధపుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికిగాని, విష్ణువు ఆలయానికిగాని వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాల నాచరించి, స్తోత్ర నమస్కారాలు సమర్పించి, నృత్య, గీత, వాయిద్య మొదలైన సేవలను చేయాలి. 
  • దేవాలయాలలోని గాయకులూ, నర్తకులు, తాళమృదంగం మొదలైన వాద్య విశేష విద్వాంసులు వీరందరినీ విష్ణుస్వరూపులుగా భావించి, పుష్పతాంబూలాలతో అర్పించాలి, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవంతుడి ప్రతీకారాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. 
  • నాయనా! పృథురాజా! ఒకానొకకసారి నేను శ్రీహరిని దర్శించి 'తాతా! నీయొక్క నిజమైన నివాసస్థానం ఎదో చెప్పు' అని కోరాను.  
  • అందుకు ఆయన చిన్మయమయిన చిరునవ్వు నవ్వుతూ 'నారదా! నేను వైకుంఠంలోగాని, యోగుల హృదయాలలోగాని ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే వుంటాను. 
  • నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలా పూజించినా నాకు అంత సంతోషం కలగదు. 
  • ఎవరైతే నా పురాణగాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వారే నాకు శత్రువులు అవుతున్నారు' అని చెప్పాడు. 

హరిహర దుర్గాగణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు 

  • ఓ రాజా! దిరిశెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని, తెల్లటి అక్షతనుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదే విధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిశెన పూవులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. 
  • ఎవడైతే సిరిసంపదలు కావాలని కోరుకుంటున్నాడో అటువంటివాడు తులసీ దళాలతో వినాయకుడినీ, గరికతో దుర్గాదేవినీ, అవిసెపువ్వులతో సూర్యుడినీ పూజించకూడదు. ఏయే దేవతలుకు ఏ పువ్వులు శ్రేష్ఠమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా -


శ్లో     మం త్రాహీనం క్రియహీవం భక్తిహీనం సురేశ్వర !
       
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే !!

  • ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైన నప్పంటికినీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగుగాక' అని క్షమాపణ కోరుకోవాలి. ఆ తరువాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి, పునః క్షమాపణలు చెప్పుకొని, నృత్య, గాన మొదలైన ఉప చారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీకమాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజగాని, విష్ణుపూజగాని ఆచరిస్తారో వారు సమస్త పాపాలనుండి విడివడి వైకుంఠాన్ని పొంది తీరుతారు


ఐదవ అధ్యాయం సమాప్తం 
ఆరవ అధ్యాయం


నారదుడు చెబుతున్నాడు: రాజా! మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి, శుచిర్భూతుడై, నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధం తీసుకుని నదిదగ్గరకి వెళ్ళాలి. చెరువులలో గాని, దైవనిర్మిత జలాశయాల్లోగాని, నదులలోగాని, సాగరాలలో గాని, స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి, స్నానసంకల్పం చేసి, దేవతలకు అర్ఘ్యాలు ఇవ్వాలి.


శ్లో ||     నమః కమలనాభాయ నమస్తే జలశాయినే 
           నమస్తేస్తు హృషికేష గృహాణార్ఘ్యం నమోస్తుతే !!


పైవిధంగా అర్ఘ్యాదులు ఇచ్చి, దైవధ్యాన నమస్కారాలు చేసి ...ఓ దామోదరా! ఈ జల మందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపా లన్నీ నశించిపోవునుగాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రతస్నాతుడు అవుతున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించును.


స్నానవిధి

  • ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యులను స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. 
  • గృహస్థులు ఉసిరిగ పప్పు, నువ్వులచూర్ణంతోనూ - యతులు తులసి మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. 
  • విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ ఆరు తిథులలోనూ - నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి, అ తరువాతనే మంత్రస్నానం చేయాలి.
  • స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. 
  • 'భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో, సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను ఈ స్నానంతో పవిత్రున్ని చేయుగాక! విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రున్ని చేయుదురుగాక. 
  •  యజ్ఞమంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్టకశ్యప మొదలైన మునివరిష్టులు నన్ను పవిత్రం చేయుదురుగాక. 
  • గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదులు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రున్ని చేయుగాక. ముల్లోకాలలోనూగల అదిజ్యాది ప్రతి వ్రతామతల్లులు, యక్ష, సిద్ధగరుడాదులు, ఓషధులు, పర్వతములు నన్ను పవిత్రం చేయుగాక'
  • పై మంత్రయుక్తంగా స్నానం చేసి, చేతిలో పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులు అయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. 
  • ఆ తర్పణ తరువాత నీటిలోంచి తీరానికి చేరి, ప్రాతః కాలానుష్టానం (సంధ్యావందనాది) నెరవేర్చుకుని, విష్ణుపూజను చేయాలి. 
తరువాత ...


అర్ఘ్య మంత్రం :


శ్లో     వ్రతినః కార్తీకమాసి స్నాతస్య విధివాన్మమ 
        గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయాసహితో హరే!!


అనే మంత్రంతో గంధపుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. తరువాత వేదపారణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు ...


శ్లో     తీర్థాని దక్షిణే పాదౌ వేదా స్తన్ముఖమాశ్రితాః 
        సర్వాంగేష్వా శ్రితాః దేవాఃపూజితోస్మితదర్ర్పయా!
!

  • కుదిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణపూజ వలన నేను పూజితుడినవుతున్నాను' అని అనుకోవాలి. 

  • దాని తరువాత వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ చేసి, దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసి అయిన ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయుగాక' అనుకోని నమస్కరించుకోవాలి. 

  • తరువాత స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణశ్రవణంలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైన ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవనాలోక్యాన్ని పొందుతారు. 

  • సమస్త రోగహారాకము పావమారకము, సద్భుద్దీదాయకమూ పుత్రపౌత్ర ధనప్రదమూ ముక్తీ కారకమూ, విష్ణు ప్రీతికరమూ అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు.

 ఐదు ఆరు అధ్యాయాలు సమాప్తం

పద్దెనిమిదవ (బహుళ తదియ)నాటి పారాయణ సమాప్తం

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో కార్తీక పురాణం చూడండి


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.