8 కార్తీక పురాణము విశిష్టత - ఎనిమిదవ రోజు పారాయణం
ఎనిమిదవ రోజు పారాయణం
పదిహేనవ అధ్యాయము
- ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు.
- కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు.
- ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు.
- అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేథ యజ్ఞఫలాన్ని పొందుతారు.
- కార్తీకమాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు.
- కార్తీకశుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతీ దుష్కర్మా అక్షయపాపాన్నీ కలిగిస్తాయి.
- శుక్ల ద్వాదశినాడు బ్రాహ్మణసాహితుడి భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు.
- కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలోగాని, కేశవ ఆలయంలోగాని లక్షదీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు పుష్పవిమానం అధిరోహించి దేవతలచేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకొని సుఖిస్తారు.
- కార్తీకం నెల్లాళ్ళూ దీపం పెట్టలేనివాళ్ళు శుద్ధ ద్వాదశీ, చతుర్థశీ, పూర్ణిమ ఈ మూడు రోజులు అయినా దీపం పెట్టాలి.
- ఆవునుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా, దైవసన్నిధిలో దీపం వెలిగించనివాళ్ళు పుణ్యాత్ములే అవుతారు.
- ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింప చేసినవాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే, దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాలనుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
సరస్వతీ నదీతీరంలో అనాదికాలంగా పూజాపునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది. కార్తీకస్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు, నీళ్ళు జల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, పన్నెండు ప్రమిదలూ తెచ్చి దీపాలు వెలిగించి 'నారాయణార్పణమస్తు' అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉండగా, కార్తీకశుద్ధ ద్వాదశినాటి రాత్రి, బైట ఎక్కడా ఆహరం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి, ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి, మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే వుంది. తడిగా వున్న ఆ పత్తినుండి వచ్చే నూనెవాసనకు భ్రమపడిన] ఎలుక, అదేదో ఆహారంగానే భావించి - ఆ పత్తిని నోటకరచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసివున్న ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలోపడి రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీకశుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా, అదీ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై - తన పూర్వ పుణ్యవశాన, ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలోనుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి 'ఎవరివి నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?' అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు 'ఓ యతీంద్రా! నేను ఒక ఎలుకను. కేవలం గడ్డిపరకలవంటి ఆహారంతో జీవించేవాడిని ... అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడంలేదు. పూర్వజన్మలో నేను ఎవర్ని? ఏ పాపం వలన అలా ఎలుకను అయ్యాను? ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి' అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞానేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు.
నాయనా! పూర్వం నువ్వు జైమినోగోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణకోసం స్నానసంధ్యలు విసర్జించి, వ్యవసాయం చేపట్టి, వైదిక కర్మానుష్టానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ, నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులూ, పిశాచబలులు కూడా భోంచేస్తూ వేదమార్గాన్ని తప్పి తిరిగావు, అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా, ఇంటిపనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ, దానితో మాట్లాడుతూ, హాస్యాలు ఆడుతూ, నీ పిల్లలకు దానిచేతే భోజనం వగైరా పెట్టిస్తూ, నువ్వు కూడా దాని చేతికూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువవారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు, ధనానికి ఆశపడి నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి. ఎవరికో విక్రయించేశావు. ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి, అర్థాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి, పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది'
పై విధంగా యతి చెప్పింది విని తాను గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటినుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్థశి పౌర్ణములు మూడు రోజులూ సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ, మంచివాడిగా మసులుతూ, అంత్యంలో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశినాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజా దీపమాలార్పనలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపవిముక్తుడు అయి సాయుజ్యపదాన్ని పొందుతాడు అని విశ్వసించు.
పదహారవ అధ్యాయం ప్రారంభం.
స్థూపదీపము
పూర్ణిమనాడు విష్ణు సన్నిధిలో స్థూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్థంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి, ఆ తరువాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి, దానిపై నేటితో దీపం పెట్టినవాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ స్థూపదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపం పెట్టినవాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నావల్ల అయ్యే పనికాదు. అని చెప్పసాగాడు వశిష్టుడు.
కొయ్యమొద్దుకు కైవల్యం కలగడం